ఎవరు అవునని చెప్పినా, కాదని చెప్పినా సినీ ఇండస్ట్రీలో నటీమణులకు ఎదురయ్యే లైంగిక వేదింపులు నిజమేనని ఎవరైనా ఒప్పుకుంటారు. కాకపోతే ఇది అన్ని రంగాలలో ఉండేదే అనే కవరింగ్‌లు ఇస్తూ ఉంటారు. మిగిలిన రంగాల సంగతి వారు చూసుకుంటారు. ముందు మన ఇల్లుని బాగుచేసుకోవడం మన మీద ఉన్న బాధ్యత. అందరూ బికినీలు, నగ్నంగా నటించే హాలీవుడ్ నటీమణులకు సెక్స్ వేధింపులు ఎందుకు ఉంటాయి? అని కాస్త వెటకారంగా చూస్తారు.. మాట్లాడుతారు. కానీ వారు కూడా ఆడవారే గదా..! ఇక హాలీవుడ్‌లో మొదలైన లైంగిక వేధింపులు విషయం తర్వాత మన దేశంలో కూడా బహిరంగంగా చెప్పుకునే స్థాయికి వచ్చింది. మలయాళ నటి కిడ్నాప్, హత్యాయత్నం తర్వాత ఇది నివురుగప్పిన నిప్పులా మారుతోంది. హాలీవుడ్ నటీమణుల నుంచి మన దేశంలోని నటీమణులు వరకు తమకు కూడా అలాంటి విషయాలలో జరిగిన సంఘటనలను ధైర్యంగా చెబుతూ, 'మీటూ' అనే హ్యాష్‌ట్యాగ్‌ని వాడుతున్నారు.
ఇప్పటికే కంగనా రౌనత్, రిచా చద్దా, రాధికా ఆప్టే నుంచి వరలక్ష్మిశరత్‌కుమార్ వరకు ఈ విషయంలో నోరు విప్పారు. ఇక నేహాదూపియా మాట్లాడుతూ, మనకి జరిగిన అకృత్యాలు రాబోయే అమాయకమైన మరికొందరికి జరగకూడదని, దీనిపై అందరు నటీమణులు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముందుకు రావాలన్న పిలుపునిచ్చింది. దాని వల్ల భవిష్యత్తులో మరికొందరికి దూరపు కొండలు నునుపుగా భావించే వారికి ఇవి తగు జాగ్రత్తలు పాఠాలు నేర్పేలా మారుతాయి. అయితే నటీమణుల విషయానికి వస్తే మాకు కూడా అంటున్నారే గానీ అలాంటి నీచుల పేర్లు బయటపెడితే వారి పట్ల మరింత మంది జాగ్రత్తలు తీసుకునే అవకాశం.... అలాంటి పెద్ద మనుషుల ముసుగుని తొలగించడానికి సాధ్యమవుతుంది.
ఇక దీని గురించి బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, అక్షయ్‌కుమార్ లు కూడా స్పందించారు. అక్షయ్ మాట్లాడుతూ, హాలీవుడ్‌లో మొదలై ఇక్కడ కూడా ఇది తన తీవ్రతను చూపిస్తోంది. ప్రతిచోటా ఈ సమస్య ఉందని వ్యాఖ్యానించాడు. షారుఖ్ మాట్లాడుతూ, అవును.. నిజమా.. అతను అలాంటి వాడు కాదే అని ఆశ్యర్యపోవడం కాదు. ఓ మహిళ ఎంతో ధైర్యంగా తనకు జరిగిన అవమానాలు చెప్పినప్పుడు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని, వారిని గౌరవించాలి. మరీ విషాదం ఏమిటంటే.. ఇలాంటివి మన పక్కనే జరుగుతున్నా మనకు తెలియకపోవడమే అన్నాడు.