తనికెళ్లభరణి చాలా మందికి కేవలం నటుడుగా మాత్రమే తెలుసు. కానీ ఆయన రచయితగా, ఎంతో గొప్ప తెలుగు భాషాభిమానిగా కొందరికే తెలుసు. ఆయన కవితలు, మాటలలో తేటతెలుగుదనం కనిపిస్తుంది. ఇక తాజాగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతమని ఆయన కొనియాడారు. 'తెలుగులో మాట్లాడితే చులకనైపోతాం... తెలుగు మాట్లాడే వారికి అన్నం పుట్టదు. తెలుగు చచ్చిపోతోంది' అని కాకుండా 'తెలుగు వాడిగా పుట్టడంతో ఓ గర్వం ఉంది. తెలుగు మాట్లాడేవారిలో ఓ సొగసుంది. ఎంతో ఆనందం ఉంది' అని ఈ సభల ద్వారా నేనెంతో పులకరించిపోయాను. తెలుగు మహాసభల వేదిక మీద ఓ ముఖ్యమంత్రి తన గురువును ఉచితాసనంపై కూర్చొబెట్టి పాదాభివందనం చేయడంతో పులకించిపోయాను.
ఈ సందర్భంగా నేను 'సరస్వతికి సంస్కారం మొక్కినట్లు ఉన్నది.. బంగారు తెలంగాణ మెట్లు ఎక్కినట్లు ఉన్నది...మనలోని అహమంతా కాలినట్లు ఉన్నది.. కల్వకుంటలో చంద్రుడు తేలినట్లు ఉన్నది'... అని రాశాను. ఇది కేవలం మనస్పూర్తిగా కేసీఆర్‌గారికే అంకితమిస్తున్నాను. తెలుగు మన మాతృభాష. తెలుగును పిల్లలకు నేర్పడంలో గురువులు, తల్లిదండ్రులది ప్రధానమైన పాత్ర. ఏదో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాం.. వచ్చి వెళ్లాం అన్నట్లుగా కాకుండా పాఠశాల, కళాశాల స్థాయిలో నెలకొకసారైనా తెలుగువారు కలుసుకుని తెలుగు భాషాభివృద్దిపై మనసు పెట్టాలి.
పిల్లలకు తెలుగు పద్యాలు, తెలుగు గొప్పతనం గురించి చెప్పాలి.. అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా గిడుగు రామ్మూర్తి, రావూరి భరద్వాజ, గద్దర్, అందెశ్రీ, చంద్రబాబు, ఎన్టీఆర్ వంటి వారిని విస్మరించడం మాత్రం బాధాకరమనే చెప్పాలి.