అక్కినేని నాగార్జున చిన్నకుమారుడు అక్కినేని అఖిల్ నటించిన తొలి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ అయింది. దాంతో నాగార్జుననే రంగంలోకి దిగి తానే నిర్మాతగా, ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా, స్క్రీన్‌ప్లేతోనే మ్యాజిక్ చేసి తమ ఫ్యామిలీకి 'మనం' వంటి క్లాసిక్‌ని అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్‌కి రీలాంచ్ మూవీగా 'హలో'ని నిర్మించాడు. ఈ వారం విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో నాగార్జున, అఖిల్ వంటివారు బిజీగా ఉన్నారు. ఇక తాజాగా నాగార్జున ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన సినిమా స్టోరీలైన్‌ని చెప్పేసి ఆశ్చర్యం కలిగించాడు. తన చిన్నతనంలో విడిపోయిన సోల్‌మేట్ కోసం 15ఏళ్లుగా ఎదురు చూసే ఓ కుర్రాడికి ఓ ఫోన్ ద్వారా ఆమె ఆధారం తెలుస్తుంది. కానీ ఆ ఫోన్ పోతుంది. దాంతో తన సోల్‌మేట్‌ని కలిసేందుకే ఆ కుర్రాడు ఏమి చేశాడు? ఆ పయనంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? చివరకు తన సోల్‌మేట్‌ని ఎలా కలుసుకున్నాడు? అనేదే స్టోరీ అని, ఇదొక లవ్ అండ్ అడ్వంచర్ మూవీ అని తేల్చిచెప్పాడు.
ఇక ఇందులో అఖిల్‌తో పాటు కళ్యాణిప్రియదర్శన్, అఖిల్‌కి తల్లిగా రమ్యకృష్ణ నటన ఎంతో అద్భుతంగా ఉంటాయని, మంచి కథ దొరికితే అఖిల్‌తో కలిసి నటిస్తానని చెప్పిన నాగార్జున స్టోరీ లైన్ ఇదే అయినప్పటికీ విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రం కథనంలో తనదైన మ్యాజిక్ చూపించాడని అన్నాడు. ఇక ఇలా సినిమాకి ముందే స్టోరీ పాయింట్‌ని రివీల్ చేయడం అనేది హిచ్‌కాక్ చిత్రాలలో కనిపిస్తుంది. ఆయన మొదటి షాట్‌లోనే సినిమా కాన్సెప్ట్ ఏమిటో చెప్పేస్తాడు. కానీ ఆ తర్వాత కథనంలో మెలికలు వేస్తూ, వాటిని విప్పుతూ తనదైన సస్పెన్స్‌ని మెయిన్‌టెయిన్ చేస్తాడు. ఇదే ఫార్ములాని రాజమౌళి కూడా 'మగధీర, ఈగ' విషయాలలో ఫాలో అయ్యాడు.
'మగధీర' 700ఏళ్ల కిందట జరిగే కథ అని, పునర్జన్మల నేపధ్యంలో ఉంటుందని ముందే చెప్పాడు. మొదటి షాట్‌లోనే హీరోహీరోయిన్లు పర్వతంపై నుంచి కిందపడి మరణించడంతో తన కాన్సెప్ట్ ఏమిటో ముందుగా రివీల్ చేశాడు. అలాగే 'ఈగ' స్టోరీలైన్‌ని కూడా జక్కన్న ముందుగానే చెప్పేశాడు. ఇప్పుడు విక్రమ్ కె.కుమార్, నాగార్జునలు కూడా హిచ్‌కాక్, రాజమౌళి వంటి వారినే ఫాలో అవుతుండటం విశేషం.