మన ఫిల్మ్ మేకర్స్ ఏదైనా అసభ్యం, బూతు వంటి విషయాలలో సెన్సార్‌వారు కఠినంగా వ్యవహరిస్తే తమ క్రియేటివిటీని చంపేస్తున్నారని, తమ భావ ప్రకటన స్వేచ్చపై కత్తులు దూస్తున్నాని సెన్సార్‌పై మండిపడుతున్నారు. బూతులు, హింస ఎక్కువగా ఉంటే వాటిని సెన్సార్ చేయడమో లేక మ్యూట్ చేయడమో చేసినా, కొన్ని కులాలు, కొన్ని వర్గాలు, కొందరి నిజజీవితాలను వక్రీకరించి చెప్పినా కూడా అది తమ క్రియేటివిటీకి నిదర్శమని, సినిమా చూడకుండానే ఇలా చేస్తున్నారేమిటని మండిపడుతుంటారు. 'ఉడ్తా పంజాబ్' నుంచి 'పద్మావతి' వరకు అదే సమస్య. ఇక సినిమాలకైతే సెన్సార్ ఉంది. కానీ వెబ్‌సీరిస్‌లకు సెన్సార్ లేదు కదా..! అందుకే సినిమాలలో పచ్చి బూతులను, శృంగారాన్ని, హింసను చూపించలేని వాటిని, కొందరు వర్గాలను టార్గెట్ చేసినట్లుగా అనిపించే వాటిని వెబ్‌సిరీస్‌ల పేరుతో తమ విశృంఖలత్వాన్ని చూపిస్తున్నారు.
ఇక ఇలాంటి వాటిల్లో వెండితెరపై సెన్సార్ ఉన్నా కూడా వర్మ ఎంతగా రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే. ఇక ఏ ఆటంకం లేని వెబ్‌సిరీస్ అయితే ఆయన ఉన్మాదానికి హద్దే ఉండదు. దానిని ఓ బోల్డ్ కంటెంట్ అని, వాస్తవాలను చూపిస్తున్నాననే భ్రమలో ఆయన వెండితెర మీద నుంచి బుల్లితెర వెబ్‌సిరీస్‌లను పచ్చిగా తీయడానికి రెడీ అయ్యాడని ఆయన తీసిన 'కడప' అనే వెబ్‌సిరీస్ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 'దెం..లాట, లం.. కొడకా' అనే బూతులకు హద్దే లేదు. కత్తులు, నరకడాలు, బూతులు తప్పితే ఇందులో మరో కంటెంట్ లేదు.
'రాయలసీమ ఫ్యాక్షన్‌కి తల్లి అయితే.. కడప తండ్రి' అని చెప్పడం.. ముఖ్యంగా రాయలసీమ రెడ్లను టార్గెట్ చేస్తూ... అనేక కుల వర్గాల మీద ఆయన పెడుతున్న చిచ్చు చూస్తే భవిష్యత్తులో వెబ్‌సిరీస్‌లకు కూడా సెన్సార్ ఉండాల్సిందేనన్న ఉద్యమాలు వచ్చినా రావచ్చు. వీరి దృష్టిలో బోల్డ్ కంటెంట్ అంటే ఓ 'అర్జున్‌రెడ్డి', ఓ 'రక్తచరిత్ర', ఓ 'కడప' అని వాదించే వారు ఉన్నారు. ఆదరించే వారు ఉంటే మాత్రం ఇంతకన్నా హీనమైన బతుకు మరోటి లేదని చెప్పాలి.