డిసెంబర్ 16 న అజ్ఞాతవాసి టీజర్ విడుదలని గ్రాండ్ గా ఒక పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్.. అందులో ఏ టైం కి అజ్ఞాతవాసి టీజర్ ని విడుదల చేస్తారో అనే విషయాన్ని చెప్పడం మరిచిపోయినట్టున్నారు. అందుకే ఈ రోజు శనివారం ఉదయం నుండి పవన్ ఫ్యాన్స్ దగ్గరనుండి అన్ని వర్గాల ప్రేక్షకులు అజ్ఞాతవాసి టీజర్ కోసం వేయికళ్లతో ఎదురు చూశారు. అయితే ఆ సమయం రానేవచ్చింది. అజ్ఞాతవాసి టీజర్ ని అలా యూట్యూబ్ లో విడుదల చేశారో లేదో.. ఇలా టాప్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి టీజర్ లో ఏముందో చూసేద్దాం పదండి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అజ్ఞాతవాసి టీజర్ లో అద్భుతమైన లొకేషన్స్ తో పాటు.. పవన్ కళ్యాణ్ అదిరిపోయే లుక్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. టీజర్ షాట్స్ అన్నిఅలా వచ్చి ఇలా గబగబా వెళ్ళిపోయినా.. కావాల్సిన క్లారిటీ మాత్రం వచ్చేసింది. ఎవరికివారే రిచ్ లుక్ తో.. ఈ సినిమా టీజర్ మొత్తం నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ నవరసాలు పలికించాడా.. అనే భావన కలుగుతుంది. ఎందుకంటే పవన్ మొహంలో హావభావాలు.. కోపం, అమాయకత్వం, ప్రేమ, ఆశ్చర్యం, బాధ, అణుకువ, భయం ఇలా అన్ని రకాల హావభావాలను పలికించిన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాలో ఒక కోటీశ్వరుడనే విషయం అర్ధమవుతుంది. అలాగే హీరోయిన్ తో రొమాంటిక్ యాంగిల్ ని ఎంత అందంగా చూపించారో.. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో అంతే క్రోధాన్ని చూపించాడు పవన్ కళ్యాణ్. కీర్తి సురేష్.. పవన్ ని ట్రీట్ చేసే విధానం, అను ఇమ్మాన్యుయేల్ పవన్ తో చేసే రొమాన్స్ హైలెట్ గా కనబడుతున్నాయి. ఇకపోతే టీజర్ చివర్లో మురళి శర్మ వీడి చర్యలు ఊహాతీతం వర్మ అంటే.. దానికి రావు రమేష్ దట్ ఈజ్ ది బ్యూటీ అంటూ చెప్పే డైలాగ్ తో ఎండ్ చేశారు.
మరి భారీ బడ్జెట్ అంటే ఏంటో అనుకున్నాం.. ఈ అజ్ఞాతవాసి టీజర్ చూస్తుంటే ఆ భారీ తనం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. నిర్మాతలు ఏ రేంజ్ లో ఖర్చు పెట్టారో ఫుల్ గా అర్ధమవుతుంది. మరి అజ్ఞాతవాసి టీజర్ ని చూసిన పవన్ ఫ్యాన్స్ ఇక సినిమా విడుదల వరకు ఎంత ఓపిక పడతారనేది చూడాలి.