తాజాగా నాటి స్టార్ హీరోయిన్, నేటి వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా, నిర్మాత బండ్లగణేష్‌లు ఇద్దరు తమ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుని చర్చను రచ్చ చేశారు. ఇక ఓ మహిళను అలా అంటావా? అని వైసీపీ మహిళానేతలు తాజాగా విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ వాడైన బండ్లగణేష్ రోజాని తీవ్రంగా దూషించడం ఏమిటంటూ.. దీనికి కూడా ప్రాంతీయత రంగు పులుముతున్నారు. ఇక రోజాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ముందుగా రోజా పవన్‌కి క్షమాపణ చెబితే, తర్వాత నేనురోజాకి క్షమాపణ చెబుతానని బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు.
ఓ మహిళానేత అయి ఉండి పవన్‌ని వాడు వీడు అని దుర్భాషలాడటం ఎంత వరకు సమంజసం? నేను ఏ ప్రాంతం వాడినైనా కావచ్చు. కానీ నాకు పవన్ దేవుడితో సమానం. ఆయనను వాడు, వీడు అని తిట్టవద్దని రోజాకి చెప్పాను. కానీ ఆమె రెచ్చగొట్టి పవన్‌ని నానా మాటలు అనడంతో నేను అలా మాట్లాడాల్సివచ్చింది. ముందుగా రోజానే అలా మాట్లాడటంతో నేను కూడా అలాగే స్పందించాను. ఇక రోజాలా మిగిలిన వైసీపీ మహిళానేతలు మాట్లాడటం లేదు. వాసిరెడ్డి పద్మగారు ఎంతో హుందాగా మాట్లాడుతారు.
రోజా ఇలా మాట్లాడటం వల్ల వైసీపీకి నష్టమే గానీ లాభం ఉండదని తెలుసుకోవాలి. ఓ మహిళానేత వాడు, వీడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చా? నన్ను అరెస్ట్ చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నేను మాట్లాడిన మాటలు చట్ట విరుద్ధమని నిరూపించండి. నేను చేసింది తప్పని ఉంటే చట్టానికి నేను గౌరవం ఇస్తాను. రోజాగారు నోరు జారారుకాబట్టే నేను అలా మాట్లాడాను. కాబట్టి ఆమెకి క్షమాపణ చేప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.