ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. కేసీఆర్‌కి తెలుగుపై ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను నాటి రోజుల్లో ఓ శోభన్‌బాబు చిత్రం చూశానని, దానిలో పూతరేకులు అనే పదం వినిపించిందని చెబుతూ, నేను పూలరేకుల బదులుగా తప్పుగా పూతరేకులు అనే పదాన్ని వాడారేమో అనే అనుమానంతో ఆ సినిమా పాటల పుస్తకం కొని చూశాను. అందులో కూడా పూతరేకులు అనే ఉంది. ఆ పదానికి అర్ధమేమిటని మా లెక్చరర్‌ని అడిగాను. ఆయన నాకు కూడా తెలియదని చెప్పాడు.
ఆ తర్వాత మా లెక్చరరే ఆ పదం ఏమిటో కనిపెట్టి అవి ఆంధ్రా ప్రాంతంలోని ఓ స్వీట్ పేరు అని చెప్పారు. నాడు 1972లో హైదరాబాద్‌లో ఎక్కడా పూతరేకులు దొరికేవి కావు. కానీ నేడు హైదరాబాద్ అంతటా అవి ఉంటున్నాయి. ఇక రాయి వంటి నన్ను నా గురువుగారైన మృత్యుంజయ శర్మ సానబెట్టారు. తెలుగులో అద్భుతమైన పదాలు ఉన్నాయి. ఎవరికైనా తొలి బడి అమ్మఒడే. అమ్మ నుంచే మనం మన మాతృభాషని నేర్చుకుంటాం.
ఇక అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన ఘనత తెలంగాణకు ఉంది. ముఖ్యంగా సిద్దిపేటకు చెందిన ఎందరో మహాకవులు తమ సాహిత్యాన్ని తెలుగు వారికి అందించారు అని చెబుతూ, పలు పద్యాలను పాడి వాటి తాత్పర్యాలను చెబుతూ, సభికుల హర్షధ్వానాలు అందుకుకున్నారు.