'ధృవ' నుంచి రామ్‌చరణ్ తన గేర్‌ని మార్చాడు. అంతకుముందు మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన వరుసగా సినిమాలు దెబ్బ కొడుతూ రావడంతో రొటీన్‌కే రొటీన్ అనిపించే కథలను పక్కనపెట్టాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దానితోపాటు మరో వైపు పక్కా మాస్ చిత్రంగా బోయపాటి శ్రీను చిత్రం కూడా చేయనున్నాడు. సో.. రామ్‌చరణ్ తన చిత్రాల విషయంలో సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నాడు.
మరోవైపు రామ్‌చరణ్‌కి సంబంధించిన 'రంగస్థలం 1985' ఫస్ట్‌లుక్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. ఆయన గుబురు గడ్డం, పంచె కట్టుతో ఎంతో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. వీటికి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇక రామ్‌చరణ్, సమంతలు కలిసి ఉన్న లీకైన ఫొటోలు, సమంత అంట్లు తోముతూ, బర్రెలు తోలుకెళ్తున్న సీన్స్ చూస్తే అచ్చు గ్రామీణ యువతి యువకులుగా వీరు బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ సీన్స్‌ని తాజాగా చిరంజీవి చూశాడట. ఇందులో మరీ డీగ్లామరైజ్‌డ్ సీన్స్ ఉన్నాయని, వాటికి కాస్త మాస్, క్లాస్ లుక్ ఇచ్చి రీషూట్ చేయాల్సిందిగా చిరు కోరాడట.
ఇక ఈ చిత్రం తాను కెరీర్ మొదట్లో నటించిన 'ఊరికిచ్చిన మాట' తరహాలో ఉందని చిరు అభిప్రాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి చిరు మాటలను విని సుకుమార్ రీషూట్లుచేస్తాడా? లేదా? అనేది తెలియాల్సివుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తయినా కూడా సంక్రాంతికి బాబాయ్ పవన్ 'అజ్ఞాతవాసి'గా రానుండటంతో 'రంగస్థలం 1985' మార్చి 30న విడుదల కానుంది. ఇక చిరంజీవి ఎలాగూ మాస్ ఇమేజ్‌లో పడి ఇలాంటి ప్రయోగాలు చేయలేకపోయాడు.
తాజాగా పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి కూడా ఎన్టీఆర్‌కి చెప్పుకోవడానికి ఎన్నో చిత్రాలు ఉన్నాయని, ఏయన్నార్‌కి కూడా ఉన్నాయని, ఇక కృష్ణకి 'అల్లూరి సీతారామరాజు', శోభన్‌బాబుకి 'సంపూర్ణ రామాయణం' వంటివి ఉన్నాయి. కానీ చిరంజీవి ముసలి వాడైన తర్వాత గొప్పగా చెప్పుకునే సినిమానే లేదు. 'సై...రా..నరసింహారెడ్డి'తో ఆ లోటు తీరుతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరి చిరంజీవి కూడా తన కుమారుడి ప్రయోగాలను వద్దని చెప్పి, రొటీన్ చిత్రాలే చేయమని చెబుతుండటం సరైన విధానం కాదేమో అనిపిస్తోంది.