తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా కూడా పదేళ్లపాటు హైదరాబాదే ఏపీకి రాజధానిగా ఉంటుందని విభజన చట్టం చెబుతోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాల పట్టి, ఆయన సలహాదారు అయిన ఇవాంకా పాల్గొన్న పారిశ్రామికవేత్తల సదస్సుకు చంద్రబాబుకి ఆహ్వానం లేదు. ఇక తాజాగా ఐదు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరపుతోన్న ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. దేశవిదేశాలకు చెందిన పలువురు సాహితీ ప్రియులను, ముఖ్యులను ఈ వేడుకలకు ఆహ్వానించారు. కానీ పక్క రాష్ట్రమైన ఏపీకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మాత్రం అసలు ఆహ్వానమే లేదు.
మరోవైపు తెలుగువారికి ఢిల్లీలో జరుగుతున్న అవమానాలతో అట్టుడికిపోయి, దేశ విదేశాలలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపి, తెలుగుకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకుని వచ్చిన దిగ్గజ నటుడు, టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు, నాటి సమైక్యాంద్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును కూడా ఈ వేడుకల సందర్భంగా ప్రస్తావించకపోవడం దారుణం. తెలుగు మహా సభలకు సంబంధించిన వేడుకలకు చెందిన ఎన్నో ఫెక్ల్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు హైదరాబాద్‌లో వెలిసినా కూడా మచ్చుకి ఒక్కదానిలో కూడా ఎన్టీఆర్ బొమ్మ లేకపోవడం తీవ్ర ఆక్షేపణీయం.
ఇక కేసీఆర్‌కి రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీఆరే. ఆయనకు చంద్రబాబుతో విబేధాలు ఉండవచ్చు. కానీ కేసీఆర్‌కి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. అదే అభిమానంతో ఆయన తన కుమారుడికి కె.తారకరామారావు అనే పేరును పెట్టాడు. ఇక తనను తెలుగు మహాసభలకు పిలవకపోవడంపై చంద్రబాబు హుందాగా స్పందించాడు. తనని పిలవకపోయినా ఫర్వాలేదని, తెలుగుకు మరింత గౌరవం ఇవ్వాలని, తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా అందరు ఒకటేనని, తెలుగు భాష పరిరక్షణకు సంబంధించిన ఏ విషయంలోనైనా టిడిపి మద్దతు ఉంటుందని ఆయన దీనిపై స్పందించారు.