చంద్రబాబు ఎక్కువగా సినీ గ్లామర్‌ని నమ్ముకుంటాడనే విమర్శ ఉంది. తన పార్టీలో వారిని చేరేలా ప్రోత్సహించడం, ఎన్నికల ప్రచారాలలో వేణుమాధవ్ వంటి వారికి కూడా పెద్ద పీట వేయడం, ఎన్నికలతో పాటు పుష్కరాలు, ఇతర విషయాలలో సినీ దర్శకుల చేత డాక్యుమెంటరీలు, ప్రచార చిత్రాలు రూపొందిస్తూ ఉంటాడు. గతంలో రాఘవేంద్రరావు నుంచి ఈవీవీ సత్యనారాయణ వరకు బోయపాటి శ్రీను కూడా టిడిపికి ప్రచార చిత్రాలను తయారు చేసిన వారే. ఇక తాజాగా ఏపీ కొత్త రాజధాని అమరావతిలో అసెంబ్లీ, ఇతర నిర్మాణాల ఆకృతులను 'బాహుబలి' దర్శకుడు జక్కన్నకు ఇవ్వడంపై బాబుకి పలువురి నుంచి విమర్శలు ఎదురయ్యాయి.
రాజధాని అంటే బాహుబలి సెట్టింగ్ కాదని, కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే రాజమౌళిని చంద్రబాబు సీన్‌లోకి తీసుకుని వచ్చాడని అందరూ ఏకి పారేశారు. కానీ వారి విమర్శలకు జక్కన్న తన చేతలతోనే సమాధానం ఇచ్చాడు. ఆయన తాజాగా అసెంబ్లీ సెంటర్ హాల్‌లో పెట్టే తెలుగు తల్లి విగ్రహ డిజైన్‌ని రూపొందించాడు. చంద్రబాబు ప్రజలను మోసగించేందుకు తెచ్చే సినీనటులు, దర్శకులను తరిమి కొట్టండి అని జగన్ పిలుపునిచ్చిన వెంటనే 2.29 నిమిషాల తెలుగుతల్లి వీడియోను రాజమౌళి విడుదల చేశాడు. అరసవెల్లిలోని సూర్యనారాయణ స్వామి విగ్రహం మీద దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మొదలయ్యే కాలంలో, ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం మొదలయ్యే సమయంలో సూర్యకిరణాలు నేరుగా సూర్యనారాయణ స్వామి విగ్రహంపై పడుతాయి. ఇదే ఘటన గుడి మల్లన్న దేవాలయంలో కూడా జరుగుతుంది.
వాటిని దృష్టిలో పెట్టుకుని జక్కన్న అసెంబ్లీ సెంటర్ హాల్‌లో ఉంచే తెలుగు తల్లి విగ్రహాన్ని డిజైన్ చేశాడు. దీనికోసం కంప్యూటర్ ప్రోగ్రాంని మూడు అద్దాల సాయంతో తీర్చిదిద్దాడు. ఉదయం 9గంటలకు సూర్యకిరణాలు ఒక అద్దంపై పడి రెండో అద్దంపైకి, ఆ తర్వాత మూడో అద్దంపై పడి తెలుగుతల్లిపై పడతాయి. ఆ సూర్యకిరణాలు తెలుగు తల్లి విగ్రహం మీద పడిన వెంటనే మా తెలుగు తల్లికి మల్లెపూదండ... గీతం మొదలవుతుంది.