మనదేశంలో ఎన్నో రాజకీయ పరమైన అంశాలు, క్రికెట్ మ్యాచ్‌లు, బాలీవుడ్ చిత్రాలు, హీరోల గురించే గతంలో అందరూ ఎక్కువగా చర్చించుకునే వారు. సోషల్‌మీడియాలో కూడా నెటిజన్లు ఎక్కువగా ఆ అంశాలపైనే అమితాసక్తిని కనబరిచేవారు. కానీ 'బాహుబలి-ది బిగినింగ్' దెబ్బకి అందరూ 'బాహుబలి-ది బిగినింగ్'పై అత్యధిక ఆసక్తి చూపారు. ఇక రెండో భాగం విషయంలో రాజమౌళి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే విషయం సస్పెన్స్‌లో ఉంచి ప్రణాళికాబద్దంగా అన్నిచోట్లా అదే చర్చ సాగేలా చేశాడు. ఇక బాహుబలి కలెక్షన్లు, రికార్డుల పరంగా దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం, ఆసక్తి, కలెక్షన్లు చూసిన వారు విస్తుపోయారు.
'బాహుబలి-ది కన్‌క్లూజన్'కోసం ఎందరో గూగుల్‌లో అత్యధిక స్థాయిలో సెర్చ్ చేశారు. గూగుల్ సెర్చ్ టాప్10లో మొదటి స్థానం 'బాహుబలి-ది కన్‌క్లూజన్'కే దక్కింది. ఈ విధంగా ఇండియన్ గూగుల్ రారాజుగా 'బాహుబలి 2' రికార్డులు తిరగరాసింది. ఇక భారతీయులు ఎంతో ఇష్టపడే రాజకీయాలు, క్రికెట్‌తో పాటు మిగిలినవి ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి. కాగా ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కూడా అత్యధిక ఆసక్తిని చూపిన అంశంగా ఆల్‌రెడీ 'బాహుబలి 2' నిలిచిన సంగతి తెలిసిందే.
నిన్నమొన్నటి వరకు క్రికెట్, బాలీవుడ్‌పై ఆసక్తిని చూపించిన వారు కూడా 2017లో 'బాహుబలి' మాయలో పడిపోయారంటే అసలు ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ అర్ధమవుతుంది.