హీరోయిన్లకు పెళ్లయితే వ్యక్తిగత జీవితంలోనే కాదు కెరీర్‌పరంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి. సినిమాలు తగ్గించడం, గ్లామర్‌షోలకు నో చెప్పడంతో పాటు పార్టీలు, ఫంక్షన్ల వంటి వాటికి కూడా పెద్దగా రారు. కానీ సమంత మాత్రం పెళ్లయినా కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని చెబుతోంది. తన స్వేచ్చకి ఇప్పటివరకు ఇబ్బందులు ఎదురుకాలేదని, కానీ ఒక్క విషయంలో మాత్రం తనలో తేడా కనిపిస్తోందని చెబుతోంది. ఇంతకు ముందు నేను నటించే చిత్రాల కథలు తన వద్దకు వచ్చినప్పుడు అది బాగాలేదు.. ఇది బాగా లేదు.. అని అందులోని తప్పులని వెతికేదట. ఇక పెళ్లయిన తర్వాత ఈ ధోరణి మరింతగా పెరిగిందని, ప్రతి సినిమాలోనూ విమర్శకురాలి కోణంలో తప్పులు వెతుకుతున్నానని, ఈ విషయంలో తన చాదస్తం మరింత ఎక్కువైందని అంటోంది.
ఇక ఆమె తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేయడం లేదని, తన పాత్రకు ఇంపార్టెన్స్ లేకుంటే నో చెబుతూ పక్కన పెట్టేస్తున్నానని చెబుతోంది. అయినా అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఆ మాత్రం సినిమాల ఎంపికలో కాస్త ఆచితూచి అడుగువేయడం మంచి పనే అనిచెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె తన ఇష్టం వచ్చినట్లు గ్లామర్ పాత్రలు, ఇతర తరహా పాత్రలు చేయడం కంటే ఖాళీగా ఉండటమే నయ్యం. కాబట్టి ఆమె అన్నింటినీ తప్పు పట్టడం మంచి లక్షణం కిందకే వస్తుంది. ఇక తాజాగా ఆమె 'రంగస్థలం','మహానట' చిత్రాలలో నటిస్తోంది. 'రంగస్థలం'లో అచ్చు పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామరైజ్‌లో నటిస్తున్న ఫొటోలు ఇటీవల లీకై సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇక 'మహానటి'లో జమున పాత్ర అంటే అది కూడా అంతే ప్రత్యేకం. మరోవైపు రెండు తమిళ చిత్రాలలో కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే చేస్తోంది. తాజాగా ఓ స్టార్ హీరో చిత్రాన్ని కూడా ఆమె వదిలేసిందట. మరోవైపు కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'యూటర్న్' తెలుగు, తమిళ రీమేక్‌లని ఆమె సొంతంగా తన భర్త నాగచైతన్యతో కలసి నటించి, నిర్మించనుందని తెలుస్తోంది. తనకు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ పాత్రలే కావాలని అంటోంది సమంత..!