పాతకాలం నుంచి సామాజిక సమస్యలపైన, సామాన్యుల కష్టాలపైనా, కుల మతాల పైనా, పలు సాంఘిక దురాచారాల మీద అనేక చిత్రాలను ఎందరో తీశారు.. తీస్తున్నారు. ఇక కిందటి తరంలో కూడా దాసరి, టి.కృష్ణ, ముత్యాలసుబ్బయ్య వంటి దర్శకులు సామాజిక ఉత్తేజమే లక్ష్యంగా చిత్రాలను తెరకెక్కించారు. కానీ వారు చేదు వాస్తవాలను ప్రస్తావిస్తూనే పైన కాస్త షుగర్‌కోటింగ్ ఇచ్చి నవరసాలను రంగరించి సినిమాలు తీసేవారు. వీరికంటే పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆ విషయంలో విభిన్నం. ఆయన వాస్తవాలను వాస్తవాలుగానే, చేదు గుళికలు గానే ముక్కుసూటిగా చెబుతారు. అందుకే ఆయన కేవలం ఓ వర్గం ప్రేక్షకుల ఆదరాభిమానాలనే పొందాడు. అన్ని వర్గాల ఆమోదాన్ని పొందలేకపోయాడు. ముఖ్యంగా పెట్టుబడి దారి వ్యవస్థ, నక్సలైట్ మూలాలు ఉండే ప్రాంతాలలో ఆయన సినిమాలకు మంచి ఆదరణ, అభిమానులు ఉన్నారు. పెద్ద పెద్ద నిర్మాతలే ఒకటిరెండు చిన్న చిత్రాలు ప్లాపయితే తిరుగుటపా కట్టేస్తున్నా కూడా ఆర్.నారాయణమూర్తి మాత్రం అలాగే.. అదే దారిలో తాను విశ్వసించిన మార్గంలోనే పయనిస్తున్నారు.
'అర్ధరాత్రి స్వాతంత్య్రం, అడవి దివిటీలు, చీమలదండు, దండోరా, ఎర్రసైన్యం'ఇలా ఈయన మాదాల రంగారావు తర్వాత తెలుగు సినీ సీమలో ఎర్రబావుటా ఎగురవేస్తున్న వ్యక్తి. అయితే ఆయన కేవలం సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తారని, ఆ సమస్యల పరిష్కారాలను మాత్రం చూపరనే విమర్శ ఉంది. కానీ తాజాగా ఆయన తీస్తున్న 'అన్నదాత సుఖీభవ' చిత్రంలో అన్నదాతల కష్టాలు, కన్నీళ్లతో పాటు వాటికి పరిష్కారం కూడా చూపామని ఆర్.నారాయణమూర్తి అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు అన్నదాత సుఖీభవ అని అందరూ దీవించేవారు. కానీ నేడు అన్నదాత దు:ఖీభవగా పరిస్థితి మారింది.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. పంటలకు గిట్టుబాటు ధరని ప్రభుత్వమే కల్పించాలని చెప్పిన స్వామినాథన్ కమిటీ సిపార్సులను ఇప్పటికీ అమలు చేయడం లేదు. రైతులు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటి పరిష్కారాలను ఇందులో చూపాం.. ఈ చిత్రాన్ని ఖమ్మం, వరంగల్, ఉభయగోదావరి, న్యూఢిల్లీలలో చిత్రీకరించాం. ఫిబ్రవరిలో విడుదల చేయనున్నాం.. నాకు ఎవ్వరూ పోటీ కాదు.. నాకు నేనే పోటీ అని పీపుల్స్‌స్టార్ చెప్పుకొచ్చారు.