నిజంగా మనం పెద్దగా పట్టించుకోం.. గానీ జీవితంలో జరిగే కొన్ని కొన్ని యాధృచ్చిక సంఘటనలు ఆయా మనుషుల భవిష్యత్తులను తెలిపేలా జరుగుతూ ఉంటాయి. వాటిని మనం కాకతాళీయంగా భావించవచ్చు గానీ అవే అనుకోని ఘటనలు వారి జీవితాలను, తలరాతలను మార్చివేస్తాయి. అలాంటి సంఘటన గురించే కమెడియన్ కమ్ హీరోగా మారిన సప్తగిరి జీవితంలో జరిగిందట. ఆయన ఆమధ్య హీరోగా చేసిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఓ మోస్తరు లాభాలను సాధించింది. ఇక తాజాగా ఆయన హీరోగా నటించిన 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' విడుదలైంది. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ, నా అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. నేను సినిమాలలోకి రావాలని భావిస్తున్న సమయంలో తిరుమలకి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లాను. దేవుని దర్శనం బాగా జరిగింది. కానీ మనసు మాత్రం ఏదోలా ఉంది. అంత సానుకూలంగా మనసు లేదు. ఏవేవో నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దాంతో స్వామి వారి మాడ వీధుల్లో నిలబడి గుడినే చూస్తూ ఉండిపోయాను. ఇంతలో వెనుక నుంచి నాయనా.. సప్తగిరి కాస్త పక్కకు జరుగు.. అనే మాట వినిపించింది. వెంటనే ఆశ్యర్యంతో వెనక్కి చూశాను.
కాషాయదుస్తులు ధరించిన చిన్నజీయర్ స్వామి వంటి వారు నాకు కనిపించారు. నేను పక్కకి జరగగా, నన్ను దాటుకుని దాదాపు ముప్పై నలభై మంది సన్యాసులు నవ్వులు చిందిస్తూ వెళ్లారు. దాంతో నాలో తెలియని తన్మయత్వం, వైబ్రేషన్స్ వచ్చాయి. దాంతో నేను స్వామి వారు పిలిచిన 'సప్తగిరి' పక్కకు వెళ్లు అన్న మాటలే గుర్తుకొచ్చి నా పేరును సప్తగిరిగా మార్చుకున్నాను. అలా పేరు మార్చుకున్న పదిహేను రోజుల్లోనే నేను హైదరాబాద్ రావడం, నటునిగా మారడం వంటివన్నీ జరిగిపోయాయని చెప్పుకోచ్చాడు. నిజంగా కొన్ని పేర్లు పెట్టే వేళా విశేషం.. ఆయా పేర్లలో దాగి ఉన్న శక్తే కొందరి దశను, తలరాతను మారుస్తుంది.
శివశంకర్ వరప్రసాద్‌ని ఆంజనేయస్వామి భక్తురాలిగా ఆయన తల్లి అంజనీదేవి చిరంజీవి అని మార్చడం, కళ్యాణ్‌బాబు పేరు ముందు ఆంజనేయస్వామి పేరు మీద పవన్‌ని చేర్చడం, భక్తవత్సలం నాయుడు మోహన్‌బాబుగా మారడం, శివాజీరావు రజనీకాంత్‌గా మారడం, లారెన్స్ రాఘవేంద్రస్వామి మీద భక్తితో రాఘవలారెన్స్‌గా మారడం, అక్కినేని ఫ్యామిలీలో నాగ అనే సెంటిమెంట్‌వంటివి గమనిస్తే ఇవ్వన్నీ కాకతాళీయంగా జరిగాయని భావించలేం.