ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి మహామహులు ఉన్న సమయంలో చిరంజీవి సినిమాలలోకి అడుగుపెట్డాడు. వారితో నటిస్తూనే తనకంటూ ఓ క్రేజ్, ఇమేజ్‌ని సాధించడానికి చిరు తన కెరీర్‌లో ఎన్నోఆటంకాలు, ఆటుపోట్లు ఎదుర్కొని కష్టపడి నటునిగా, సుప్రీం హీరోగా, చివరకు మెగా హీరోగా ఎదిగాడు. కానీ ఆయన తమ్ముళ్లు, కొడుకులు, మేనల్లుళ్లులతోపాటు అల్లుఅర్జున్ నుంచి అల్లు శిరీష్ వరకు చిరంజీవి చరిష్మాతోనే ఎదిగారనేది వాస్తవం. ఇక తాజాగా చిరంజీవి కుమార్తె శ్రీజను రెండో వివాహం చేసుకున్న అల్లుడు కళ్యాణ్ కూడా హీరోగా రానున్నాడు. ఇక వీరందరికీ ఎంట్రీ వరకు చిరంజీవి ఇమేజ్ ఉపయోగపడుతుంది. కానీ టాలెంట్ లేకపోతే రెండు మూడు చిత్రాలకే కనుమరుగవుతారు. దీనికి నాగబాబే పెద్ద ఉదాహరణ. ఆయనలో టాలెంట్ లేని కారణంగానే ఆయన ఎన్నో చిత్రాలలో నటించినా, హీరోగా చేసినా కూడా రాణించలేకపోయాడు. ఇక నిర్మాతగా కూడా ఆయన అపజయాలనే మూటగట్టుకున్నాడు. అదే మిగిలిన వారు మాత్రం బాగానే రాణిస్తున్నారు.
ఇక సినీ వారసత్వం గురించి మాట్లాడాలంటే నేటి పరిస్థితులు గమనించిన వారెవ్వరైనా దానిపై మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే రాజకీయనాయకుల వారసులు రాజకీయనాయకులు అవుతున్నారు. అంబానీ వంటి బిజినెస్ టైకూన్ల కొడుకులు పారిశ్రామికవేత్తలుగా, డాక్టర్ల కొడుకులు డాక్టర్లు అవుతున్నారు. కానీ సినిమాలలో మాత్రం నట వారసులు తప్ప మిగిలిన రంగాలకు చెందిన వారుసులు అలా రాణించలేకపోతున్నారు. దర్శకుల కొడుకులు, సంగీత దర్శకుల కుమారులు, నిర్మాతల కొడుకులు వంటి వారు అరుదుగా మాత్రమే రాణిస్తున్నారు. ఇలా కొన్ని రంగాలలో ప్రతిభ లేకపోయినా వారసత్వం పని చేస్తుంటే, క్రియేటివ్ ఫీల్డ్స్‌లో గానీ , క్రీడారంగంలో గానీ కేవలం పేరు రాగానే వారసులు కాలేకపోతున్నారు. అలా అయితే ఇప్పటికే గవాస్కర్ కొడుకు ఇండియా కెప్టెన్ అయిపోవాలి. ఎస్పీబాలు కుమారుడు బిజీబిజీ కావాలి. రాఘవేంద్రరావు కుమారుడు దర్శకునిగా అదరగొట్టాలి. కానీ ఇవి ఆయా రంగాలలో పెద్దగా పనిచేయడం లేదు. కేవలం క్రియేటివ్ ఫీల్డ్ కాని వాటిల్లోనే వారసుల హవా నడుస్తోంది. ఇక వారసుల్లో కూడా రెండు రకాలు కనిపిస్తారు.
కృష్ణ పెద్దకుమారుడు రమేష్‌బాబు రాణించలేకపోతే రెండో కుమారుడు మహేష్ రాణిస్తున్నాడు. హరికృష్ణతో పాటు ఎవ్వరూ ఎన్టీఆర్ వారసులు నటులుగా రాణించేకపోయినా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్‌లు రాణిస్తున్నారు. కాబట్టి వారసత్వం అనేది కేవలం ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవరైనా టాలెంట్‌తో నిరూపించుకోవాల్సిందే. మరికొందరిని మాత్రం ప్రేక్షకులకు వారి ఫేస్‌లు, వాయిస్ అన్ని అలవాటయ్యే దాకా ప్రేక్షకుల నెత్తిన రుద్దే రకాలు కూడా ఉన్నాయి. తినగ తినగ వేపాకు కూడా తియ్యగా ఉన్నట్లు కొంతకాలం అదే పనిగా చూసిన వారినే చూస్తూ ఉంటే అదే అలవాటైపోతుంది.
ఇక తాజాగా రోజా మాట్లాడుతూ, చిరంజీవి తప్ప ఆ ఫ్యామిలీ హీరోలలో ఎవ్వరూ ఆయనలా కష్టపడలేదని, వారికి ఎంట్రీ అంత ఈజీగా దొరకడానికి మెగాస్టారే కారణమని అభిప్రాయపడింది. ఇది నిజమే... అయితే ఈ విషయాన్ని ఆల్‌రెడీ మెగా హీరోలే చిరు దారి వేస్తే దానిలో మేము నడుస్తున్నామని చెప్పి ఉన్నారు. ఇక రోజా విషయానికి వస్తే ఆమె సంపాదించిన డబ్బుగానీ, పేరు ప్రఖ్యాతులు గానీ ఆమెతోనే అంతమవుతాయా? కావు కదా...! ఆమె ఆస్తులు, పేరు అంతా ఆమె సంతానానికి ఖచ్చితంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది కదా....! వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి లేకపోతే జగన్ ఎవరు? చంద్రబాబు లేకపోతే లోకేష్‌ని పట్టించుకునే వారెవ్వరైనా ఉంటారా? మరి అందరి పెద్దల విషయంలో జరుగుతున్నదే ఇది. దీని గురించి మాట్లాడటమంటే గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు వేరుకున్నట్లు అవుతుంది...!