ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా.. రాజమౌళి తియ్యబోయే చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ కబుర్లే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎన్ని సినిమాల విషయాలు ఉన్నా కూడా రాజమౌళి చెయ్యబోయే సినిమా మీదే అందరి చూపు. అసలు రాజమౌళి నోరు మెదిపినా.. మెదపకున్నా అది ఒక సెన్సేషన్ వార్తే అవుతోంది. బాహుబలి లాంటి భారీ విజయాన్ని తన భుజాలపై ఇంకా మోస్తూనే ఉన్న రాజమౌళి.. తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడన్న చర్చ.. చాన్నాళ్లుగానే సినిమా ఇండస్ట్రీలో నడుస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తోనే ఆ సినిమా మల్టీస్టారర్ గా రూపొందుతోందని.. ఇద్దరు టాప్ హీరోలు బాక్సర్లుగా నటిస్తున్నారని మాత్రం వార్తలు సోషల్ మీడియాలో రోజుకో రకంగా హల్చల్ చేస్తున్నాయి.
అటు రాజమౌళి గాని ఇటు స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ గాని ఈ మల్టీస్టారర్ సినిమా పై పెదవి విప్పకపోయినా కూడా ఈ సినిమాకి సంబందించి న్యూస్ మాత్రం ఆగడం లేదు. అవన్నీ గాలి వార్తలే అని తెలిసినా కూడా కొంతమంది వాటినే వండి వారుస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ సినిమాకి సంబందించిన మరో రూమర్ బయటికొచ్చింది. ఇందులో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా అనూ ఇమాన్యుయేల్ ను ఫిక్స్ చేసేశారట. ఇప్పటికే అజ్ఞాతవాసిలో పవన్ కల్యాణ్ పక్కన, నా పేరు సూర్యాలో అల్లు అర్జున్ పక్కన నటిస్తున్న ఈ భామ.. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది.
మరి చరణ్ సినిమాలోనూ ఇంకా ఫైనల్ కానీ అనూ ఇమాన్యుయేల్ ఇప్పుడు... ఇలా జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ పక్కన.. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ చేతిలో పడిందన్న వార్త.. టాలీవుడ్ లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతానికి ఈ వార్త రూమర్ గానే ఉంది. ఈ విషయంపై.. ఎవరో ఒకరు త్వరలో క్లారిటీ ఇస్తే గాని అసలు విషయం తేలదు.