ఒక ప్రముఖ ఛానల్.. రాజకీయ నాయకులతో ప్రతి రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఏదో ఒక సమస్యపై ఒక డిబేట్ నిర్వహిస్తుంది. అందులో వివిధ పార్టీల వారు పాల్గొని ఆ చర్చా వేదికలో తమ తమ అభిప్రాయాలతో వాదించుకుంటారు. అలాగే మంగళవారం రాత్రి కూడా ఆ ఛానల్ వారు వారసత్వ రాజకీయాలపై ఒక చర్చా వేదికను నిర్వహించగా అందులో బిజెపి నేతతో పాటే సినిమా నిర్మాత, పవన్ కళ్యాణ్ స్వామి భక్తుడు బండ్ల గణేష్ పాల్గొన్నాడు.
రాజకీయనాయకులకు ధీటుగా ఈ చర్చలో బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ పై స్వామి భక్తిని చాటాడు. ఎవరికైనా టాలెంట్ ఉంటేనే.. సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ముందుకు వెళతారని వాదించాడు. అయితే అదే వేదికలో పాల్గొన్న మరొక నేత చిరంజీవి సినిమాల్లో నెగ్గగలిగినా రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడని.. అయినా పవన్ కళ్యణ్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని వాదనలు జరుగుతుండగా.. సదరు ఛానల్ యాంకర్ గారు వైసిపి నేత, మాజీ హీరోయిన్, జబర్దస్త్ జెడ్జ్ రోజాని లైన్ లోకి తీసుకు రాగా.... రోజా పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి ఎలా మట్లాడతాడు.. అసలు చిరంజీవి లేకుండానే సినిమాల్లో హీరోగా ఎదిగాడా.. అయినా పవన్ కళ్యాణ్ ఎవడు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడడానికి అంటూ వైసిపి నేత జగన్ మీద ఈగ వాలనీయకుండా మాట్లాడింది.
అయితే పవన్ కళ్యాణ్ మీద మాట పడేసరికి బండ్ల రెచ్చిపోయి వైసిపి నేత రోజాని నానామాటలు అనేశాడు. అందులో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ రోజాని గోల్డెన్ లెగ్ అని వెటకారం చేస్తూ.. నువ్వు వైసిపి లోనే ఉండమ్మా.. నువ్వు ఎమ్యెల్యే గా పోటీ చేసిన చోట ఒకసారి నెగ్గి ఒకసారి ఓడిపోయావ్.. అసలు నువ్వు వెళ్ళగానే వైసిపి కి మహర్దశ పట్టింది. అందుకే నువ్వు వైసిపిలోనే ఉండమ్మా అంటూ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా ఇక్కడ ప్రస్తావించడానికి ఇబ్బందికర మాటలతో బండ్ల గణేష్, రోజాని కడిగిపడేశాడు.
ఇక రోజా కూడా గణేష్ ని వదలలేదు. ఆమె కూడా బండ్ల గణేష్ తో పాటే పవన్ కళ్యాణ్ ని కూడా తన మాటలతో చీల్చి చెండాడింది.