పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ క్షణం జనవరి 10 న అజ్ఞాతవాసి విడుదలతో రానుంది. ఇప్పటికే అజ్ఞాతవాసి పబ్లిసిటీ కార్యక్రమాలు ఒక రేంజ్ లో మొదలు పెట్టింది చిత్ర బృందం. అలా అలా.. పోస్టర్స్ తోపాటు... పాటలను మార్కెట్ లోకి వదులుతూ సందడి షురూ చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న అజ్ఞాతవాసికి సంబంధించిన 'బయటకొచ్చి చూస్తే టైమేమో' అనే పాటను మార్కెట్ లోకి విడుదల చేశారు. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉండటంతో అభిమానుల్లో ఈసినిమాపై బజ్ మరింత పెంచింది.
ఇక తాజాగా మంగళవారం 'గాలి వాలుగా ఓ గులాబి వాలి.. గాయమైనదీ నా గుండెకి తగిలి.... తపించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీకోసం.... తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం' అనే పాటను విడుదల చేశారు. గత నాలుగైదు రోజులుగా ఈ పాట గురుంచి అభిమానులు బాగా వెయిట్ చేసేలా చేశారు అనిరుధ్ అండ్ కో. అంతలా ఈ పాట ప్రమోషన్ ని చేశారు. ఇక ఇప్పుడు విడుదల చేసిన 'గాలి వాలుగా ఓ గులాబి వాలి.. ' పాటను అజ్ఞాతవాసి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వయంగా ఆలపించాడు.
మరి విడుదల చేసిన రెండు పాటలు ఆకట్టుకునేలా ఉండడంతో అజ్ఞాతవాసిపై ఉన్న అంచనాలు ఇప్పుడు మరింతగా పెరిగాయి. ఇకపోతే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న చిత్ర బృందం ఇప్పుడు అజ్ఞాతవాసి ఆడియోని కూడా గ్రాండ్ లెవల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అజ్ఞాతవాసి ఆడియో హక్కులకు అదిరిపోయే రేటు రాగా... ఇప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ టెలికాస్ట్ రైట్స్ కూడా భారీ మొత్తం పలికాయి. ఈ ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ రైట్స్ కోసం టి.వి.5 దాదాపుగా 85 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆడియో ఎప్పుడు.. ఎక్కడ నిర్వహించాలనే దానిపై అజ్ఞాతవాసి యూనిట్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.