తెలుగులో 'పదహారేళ్ల వయసు'కి ఒరిజినల్ అయిన తమిళ చిత్రంలో నటించాడు రజనీకాంత్. అందులో ప్రధాన పాత్ర కమల్‌హాసన్‌ది. ఆయనపై షూటింగ్ 60రోజులు జరిగింది. కానీ రజనీ పాత్ర షూటింగ్ మూడు రోజుల్లో పూర్తయింది. సినిమా విడుదలైన తర్వాత రజనీ డైలాగ్స్‌కి, స్టైల్‌కి, మేనరిజమ్స్‌కి ప్రేక్షకులు అద్భుతంగా స్పందించారు. ఇక కమల్, రజనీ కలిసి నటించిన 'అవరగల్' చిత్రం షూటింగ్‌లో కమల్ నటిస్తూ ఉంటే రజనీ సెట్ బయట కూర్చున్నాడు. దాంతో కోపగించిన కె.బాలచందర్ రజనీని రమ్మని పిలిచి, సిగరెట్ తాగడానికి బయటకు పోయావా? కమల్ నటిస్తుంటే చూడు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెప్పాడు. అలా కమల్ నుంచి నటనను నేర్చుకున్నానని రజనీ ఇప్పటికీ చెబుతుంటాడు.
ఇక కమల్ వంటి నటుడున్న ఇండస్ట్రీలో తాను ఎదగాలంటే తనకంటూ ఏదో ప్రత్యేకత ఉండాలని భావించి, తన స్టైల్, మేనరిజమ్స్‌కి పదును పెట్టుకున్నాడు. ఇక రజనీ ఒకానొక సమయంలో చెడు అలవాట్లకు లోనయ్యాడు. దాంతో రజనీని ఎంతో అభిమానించే అమితాబ్‌బచ్చన్ స్వామి సచ్చిదానంద ఆశ్రమంకి వెళ్లు. నీ మనసుకి ఊరట లభిస్తుందని చెప్పాడు. దాంతో రజనీ జీవితమే మారిపోయింది. ఇప్పటికీ హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి వస్తూ ఉంటాడు.
ఆయన కెరీర్‌లో ఎంత స్టార్ స్టేటస్ గడించాడో నిజజీవితంలో అంతే నిరాడంబరంగా ఉంటాడు. ఇక తనకి సహాయం చేసిన ఎవ్వరినీ మర్చిపోడు. అడిగిన వారికి, ఆపదలో ఉన్న వారికి చేతిలో ఎముకలేనట్లుగా గుప్తదానాలు చేస్తూ తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నాడు.