రజనీకాంత్ పేరు శివాజీరావ్ గైక్వాడ్. ఈయన తండ్రి పేరు రామోజీరావు గైక్వాడ్. తల్లి రమాబాయ్ గృహిణి. శివాజీ చిన్నవయసులోనే ఆయన తల్లి మరణించింది. దాంతో ఆయన చిన్ననాటి నుంచి పొట్టకూటి కోసం ఎన్నో పనులు, కూలీ పని కూడా చేశాడు. ఈయన పుట్టిన బెంగుళూరులో ఎన్నో ఎన్నెన్నో పనులు చేశాడు. చివరకు బస్ కండెక్టర్‌గా కూడా పనిచేశాడు. అయినా ఆయన తనదైన స్టైల్‌ని ఎప్పుడు మర్చిపోలేదు. బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నా, బస్సు కిటకిటలాడుతున్నా 10 నిమిషాలలో టిక్కెట్లు ఇచ్చేసేవాడు.
ఇక తనదైన మేనరిజమ్స్, స్టైల్‌ని మరింత పదును పెట్టుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో ఓ నాటకంలో దుర్యోధనుని పాత్ర చేయాల్సి వచ్చింది. ఆ పాత్రను ఎందరో చేశారు. కానీ శివాజీ చేసినంత స్టైల్‌గా ఎవ్వరూ చేయలేదు. దాంతో ఆయన స్నేహితుడు రాజ్‌బహదూర్ నీలో మంచి నటుడు ఉన్నాడు. ఇక్కడే ఉంటే వాడు మరుగున పడిపోతాడని చెప్పి ప్రోత్సహించి డబ్బులిచ్చి చెన్నై పంపించాడు. అక్కడ ఆయన వేషాలు లేక పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత కూడా ఛాన్స్‌లు రాలేదు. చివరకు బాలచందర్ తాను తీస్తున్న 'అపూర్వరాగంగల్' చిత్రంలో శివాజీకి అవకాశం ఇచ్చాడు. అలా మొదటి చిత్రం తమిళంలో చేశాడు. రెండో చిత్రం కన్నడలో 'సంగమ', మూడో చిత్రం తెలుగులో 'అంతులేని కథ' ఇలా తన మొదటి మూడు చిత్రాలను మూడు దక్షిణాది భాషల్లో చేశాడు.
ఇక 'అపూర్వరాగంగల్' చిత్రంలో శివాజీకి అవకాశం ఇచ్చిన బాలచందర్ అప్పటికే ఫీల్డ్‌లో శివాజీ పేరుతో మరో హీరో ఉండటంతో తాను తీసిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలోని పాత్ర పేరైన రజనీకాంత్ అనే పేరుతో శివాజీ పేరును కాస్తా స్క్రీన్‌నేమ్‌గా రజనీకాంత్ అని నామకరణం చేశాడు. శివాజీకి ఇష్టమైన రాఘవేంద్రస్వామికి ఇష్టమైన గురువారం ఆయన నామకరణం జరిగింది. అలా శివాజీ కాస్తా రజనీగా మారాడు.