మన దక్షిణాది భామలైన శ్రీదేవి, జయసుధ వంటి వారు ఉత్తరాది కోడళ్లు అయ్యారు. అలాగే ఖుష్బూ నుంచి జ్యోతిక వరకు పలువురు ఉత్తారాది భామలు దక్షిణాది కోడళ్లు అయ్యారు. ఇక చెన్నై పిల్ల సమంత ఏకంగా అక్కినేని వంశంలోకి కోడలిగా అడుగుపెట్టింది. భవిష్యత్తులో పలువురు అదే దారిలో నడిచినా ఆశ్యర్యపడనవసరం లేదు. ఇక రకుల్‌ప్రీత్‌సింగ్ ఎప్పటి నుంచో తనకు హోం హైదరాబాద్ అని చెబుతూ, హైదరాబాద్‌లోనే ఓ ఇంటిని కొని, ఇక్కడే జిమ్ బిజినెస్‌లు చేస్తోంది. తాను కూడా తెలుగింటి కోడలిని అవుతానేమో అంటూ కాస్త సందేహం వచ్చేలా మాట్లాడుతోంది. ఇప్పటికే ఈమె తెలుగింటి కోడలిని అయినా ఆశ్యర్యం లేదని రెండు మూడుసార్లు చెప్పింది. ఒకసారైతే తమాషాగా అనుకోవచ్చు. కానీ పదే పదే రకుల్‌ప్రీత్‌సింగ్ అదే మాటను చెబుతుండటం చూస్తే కాస్త సందేహం కలుగుతోంది.
తాజాగా ఆమె మరోసారి తాను తెలుగు కుర్రాడిని వివాహం చేసుకుని తెలుగింటి కోడలిని అవుతానేమోనని చెప్పింది. మీకు తోటి నటుల నుంచి ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? సినీ రంగానికి చెందిన వారినే వివాహం చేసుకుంటారా? అని ప్రశ్నిస్తే తనకు ఎవ్వరూ ప్రపోజల్స్ చేయలేదని, అసలు అలాంటివి జరగాలని తాను ఊహించను కూడా ఊహించనని చెప్పింది. సమంతలాగా తెలుగింటి అబ్బాయిని వివాహం చేసుకుని తెలుగింటి కోడలిని అవుతానేమో? ఎవరు చెప్పగలరు? అసలు ఇంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు. సమంత లాగా తెలుగింటి కోడలిని అవుతానేమో అంటూ అదే పదాన్ని రెండు మూడు సార్లు చెప్పింది.
దీంతో ఆల్‌రెడీ ఆమె మనసులో ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానం వస్తోంది. ఇలా చెబుతూనే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కురాలిని కాదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించి చెప్పగలరు? ఆ సమయం వచ్చినప్పుడు అదే జరిగితే అందరికీ తెలుస్తుంది అంటూ కాస్త వేదాంతం కూడా కలిపి మాట్లాడుతోంది ఈ రకుల్‌భామ...!