తమిళ, మలయాళ భాషలలో మంచి ప్రేమకథలు, ఎవ్వరూ టచ్ చేయని లవ్‌స్టోరీస్ వస్తూ ఉంటాయి. తెలుగులో రీమేక్ అయిన 'నా ఆటోగ్రాఫ్' నుంచి 'ప్రేమమ్'వరకు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక పాఠశాల వయసులో టీనేజ్‌లో మెదిలే ప్రేమభావాల ఆధారంగా కూడా ఎన్నో చిత్రాలు వచ్చి ఘనవిజయం సాధించాయి. త్వరలో మరో పాఠశాల ప్రేమకథ తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. అప్పుడప్పుడే యవ్వనదశలోకి వచ్చే పాఠశాల రోజుల్లో ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు కాని వారు ఎవ్వరూ ఉండరు. తొలి ప్రేమ అనేది ఎక్కువ మందిలో పాఠశాల స్థాయిలోనే మొదలవుతుంది. కానీ దానిని ప్రేమ అనాలో లేక ఆకర్షణ అనాలో కూడా తెలియని వయసు అది. అలాంటి ఓ టీనేజ్ లవ్‌స్టోరీ ఆధారంగా తమిళంలో 'పల్లి పరువత్తిలే' చిత్రం రూపొందుతోంది.
వాసుదేవ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేలు అనే నిర్మాత నిర్మిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు శిర్పి కుమారుడు నందన్ హీరోగా నటిస్తుండగా, వెన్బ అనే అమ్మాయి హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. ఇందులో కె.యస్.రవికుమార్ ఓ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, పాఠశాల వయసులో పిల్లల బాధ్యతలు, వారి బాగోగులు తల్లిదండ్రులు చూడాలి. కానీ పిల్లలు పాఠశాల వయసులో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులతో స్కూల్‌లోనే ఎక్కువ సమయం గడుపుతారు. కాబట్టి వారిని తీర్చిదిద్దే బాధ్యత గురువులపై కూడా ఉంది. ఇక ఈ చిత్రంలో ఓ అద్బుతమైన టీచర్ పాత్రను కె.యస్.రవికుమార్ గారు పోషిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో ఉపాధ్యాయుల గురించి ఎంతగానో చర్చించాం. దాంతో ఈ మూవీని ఉపాధ్యాయులకు అంకితమిస్తున్నాం. ఈ చిత్రం సెన్సార్ కూడా జరుపుకుంది. రెండు మూడు డైలాగ్స్‌కి మాత్రం సెన్సార్ వారు అభ్యంతరం చెప్పారు. వాటిని మ్యూట్ చేశాం. దీంతో ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది. ఈ చిత్రంలోని క్లైమాక్స్ అందరి హృదయాలను తాకుతుంది. ఈ క్లైమాక్స్ చూసి సెన్సార్ వారికి కూడా కన్నీళ్లు వచ్చాయి. ఈ చిత్రం ఖచ్చితంగా నేషనల్ అవార్డును సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నానంటున్నాడు. కాగా ఈ చిత్రం ఈనెల 15వ తేదీన విడుదల కానుంది. తమిళంలో మంచి హిట్టయితే తెలుగులోకి కూడా ఇది డబ్ కావడమో లేక రీమేక్ కావడమో జరుగుతుందని చెప్పవచ్చు.