మెగామేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా విషయం 'రేయ్'తో ఎన్నో ఇబ్బందులు పడిన సాయిధరమ్‌తేజ్.. 'రేయ్' చిత్రం ఆలస్యం అవడంతో తన రెండోచిత్రంగా విడుదలైనా కూడా వరుసగా దిల్‌రాజు అండతో 'పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్' వంటి హ్యాట్రిక్ విజయాలను సాధించాడు. 'రేయ్' వచ్చి డిజాస్టర్ అయినా ఆ ఎఫెక్ట్ ఆయన కెరీర్‌పై పడలేదు. కానీ తర్వాత చేసిన 'తిక్క, విన్నర్, నక్షత్రం' వంటి చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ సమయంలో ఆయన రచయిత, 'వాంటెడ్' చిత్రంతో ఫ్లాప్‌ని అందుకున్న బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో 'జవాన్' చిత్రం చేశాడు. దీనికి దిల్‌రాజు సమర్పకునిగా వ్యవహరించినా కూడా ఈ చిత్రం నిలబడలేకపోయింది.
దిల్‌రాజు మరలా రీషూట్స్ చేయించి, ఎన్నో మార్పులు చేర్పులు చేసినా కూడా ఈ చిత్రాన్ని ఆయన కాపాడలేకపోయాడు. చివరకు ఈ చిత్రం నిర్మాతలకు, బయ్యర్లకి భారీ నష్టాలనే కలిగించిందని టాక్. దీంతో సాయి ధరమ్‌తేజ్ ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ద్వారా మరోసారి తనకు మంచి మాస్, యాక్షన్ ఇమేజ్ వస్తాయని అదే సమయంలో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో చేయనున్న చిత్రం తనని రొమాంటిక్ యాంగిల్‌లో యూత్‌కి కనెక్ట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇక వినాయక్ చిత్రంలో సాయి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రను చేస్తున్నాడట.
ప్రస్తుతం 'అజ్ఞాతవాసి'లో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా చేస్తోన్న పవన్‌కళ్యాణ్‌లలాగే వినాయక్ చిత్రంలోని పాత్ర తనకి మంచి విజయం తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. మరోవైపు కరుణాకరన్‌తో చేయబోయే చిత్రాన్ని ఈనెల 12వ తేదీ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. చిరంజీవి ఎన్నో హిట్స్ ఇచ్చిన క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో కె.యస్.రామారావు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. సంగీతాన్ని గోపీసుందర్ అందించనున్నాడు. సో.. ఈ ఫీల్‌గుడ్ మూవీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుంది..? మాస్ క్రేజ్ కలిగిన సాయికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సివుంది...!