'పైసావసూల్' డిజాస్టర్‌గా నిలిచినా బాలయ్య మాత్రం తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆయన సికె ఎంటర్‌టైనర్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాతగా తమిళ సీనియర్ దర్శకుడు కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. జనవరి 12న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం రిలీజ్‌కి కేవలం నెలరోజులే సమయం ఉన్న నేపధ్యంలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇందులో బ్రహ్మానందం మీద ఓ పెద్ద కామెడీ ట్రాక్‌ని రచయిత. ఎం.రత్నం రాశాడట. దాంతో ఎంతో కాలం తర్వాత బాలయ్యవంటి ఓ స్టార్ చిత్రంలో బ్రహ్మికి ఓ మంచి చాన్స్ వచ్చిందని అందరూ భావించారు. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో బ్రహ్మి కామెడీ ట్రాక్‌ని ఎడిటింగ్‌లో లేపేసినట్లు తెలుస్తోంది.
ఇక ఇందులో బాలయ్యకి జోడీగా నయనతార, హరిప్రియ, నటాషాదోషిలు నటిస్తున్నారు. ఇక నయనతార ఇందులో పవర్‌ఫుల్ పాత్రను చేస్తుండటంతో ఆమె పాత్ర ముందు మిగిలిన ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇక 'పిల్లజమీందార్' చిత్రం పెద్ద విజయం సాధించినా కూడా హరిప్రియకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ప్రస్తుతం ఆమె కన్నడలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కన్నడలో స్టార్స్‌తో నాలుగు చిత్రాలు, తమిళ, మలయాళంలో ఒక్కో చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఇంకా చిన్నవయసు అమ్మాయే అయిన హరిప్రియ బాలయ్య వంటి సీనియర్ స్టార్ చిత్రంలో చేయడం ఆమెకి ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అనే విషయంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
హరిప్రియ మాత్రం తనకు తెలుగు భాషపై మంచి పట్టు ఉందని, తెలుగును స్పష్టంగా మాట్లాడగలనని చెబుతూ, ఈ చిత్రంలో తన పాత్రకు తానే ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలిపింది. ఇక ఈచిత్రం తర్వాత బాలయ్య ఎస్వీకృష్ణారెడ్డి డైరెక్షన్‌లో ఓ ఫాంటసీ చిత్రాన్ని, ఆ తర్వాత తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తేజతో చేయడానికి రెడీ అవుతున్నాడు.