రాజకీయాలకు, సినిమాలకు చాలా తేడా ఉంది. జనాలు, నినాదాలు, జనాలు పోటెత్తినంత మాత్రాన సినిమాలు ఆడతాయేమో తెలియదు కానీ రాజకీయాలలో మాత్రం అది కేవలం ఓ హంగామా షో మాత్రమే. జగన్ గతంలో పాదయాత్ర చేస్తే వచ్చిన స్పందన చూసి ఆయన ఇక నేనే 30ఏళ్లపాటు సీఎంనని భావించి, తనపార్టీలోని మంచి నాయకులను, సీనియర్లను కూడా అవమానించి చివరకు సీఎం కాలేకపోయాడు. తనను చూసే ఓట్లు వేస్తారు గానీ అభ్యర్దులను చూసి కాదని పొంగిపోయాడు. ఫలితం తెలిసిందే. ఇక ప్రజారాజ్యం సమయంలో కూడా చిరంజీవి, పవన్‌ల సభలకు, ప్రచారానికి జనం పోటెత్తారు. కానీ పప్పులు ఉడకలేదు. జనాలు రావడం.. విపరీతంగా పొడగ్తలో బలానికి నిదర్శనం అనుకుంటే జ్యోతిలక్ష్మితో పాటు సన్నిలియోన్ వెళ్లినా కూడా మోదీ కంటే ఎక్కువ మంది జనాలు వస్తారు.
ఇక పవన్ అభిమానులు ఈ మద్య ఆయన ఇంగ్లండ్‌లో అవార్డు తీసుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగిని పరామర్శించడానికి వెళ్లితే అక్కడ కూడా సమయం, సందర్భం లేకుండా సీఎం .. సీఎం అని నినాదాలే వినిపించాయి. ఇక పోలవరంని సందర్శించడానికి వస్తే కూడా 'సీఎం సీఎం' వంటి నినాదాలే వినిపించాయి. వీటి వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పవన్ మాత్రం నిజాయితీగా నాకు పదవి కాంక్ష, పిచ్చి లేవు. అవి ఉంటే ఇప్పటికే అనకాపల్లిఎంపీని అయి ఉండేవాడినని చెప్పిన మాట మాత్రం వాస్తవం.
ఇక పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలని వినకపోతే తాను కూడా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశాడు. మొత్తానికి పోలవరంలో ఫ్యాన్స్ సీఎం.. సీఎం అని అరుస్తూంటే పవన్ కూడా వారిని వారించాడు. పవన్ పదవుల వద్దు అవి నాకు ముఖ్యం కాదని ఓ పక్కన చెబుతుంటే మరోవైపు ఆయన్ను ఇప్పుడు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో సీఎంని చేస్తున్నారు.
దీని వల్ల ఆయన తనకు పదవి వద్దు, అధికారం అవసరం లేదు అనే మాటల విశ్వసనీయతను ఆయన అభిమానులు తప్పుదారి పట్టించి సామాన్యులలో అయోమయం సృష్టించి చివరకు ఆయన్ను కూడా నాశనం చేసేలా ఉన్నారు. ముఖ్యంగా పవన్ ఒకవైపు రాజకీయాలను సీరియస్‌గా తీసుకునే సమయం వస్తుంటే ఆయన అభిమానులు మాత్రం ఆయన్ను ఇంకా ఓ హీరోగా మాత్రమే భావిస్తున్నారని అనిపిస్తోంది..!