ఇటీవల రాంగోపాల్‌వర్మ భక్తుడిలా నేల మీద కూర్చుని, పక్కనే ఓడ్కా గ్లాస్ పెట్టుకుని, తన దేవత అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చిత్రంలోని పాటలో ఆమెను చూస్తూ తన్మయత్వంలో మునిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఓ యజమాని తాను శ్రీదేవికి వీరాభిమాని కావడంతో అచ్చు ఆమెలాగే ఉన్న ఆమె ప్రతిమలు తన రెస్టారెంట్‌లో పెట్టుకుని తన దేవత భక్తిని చాటుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరో వీరాభిమాని ఆమె కోసం మరో బృహత్తర కార్యం నెత్తిన వేసుకున్నాడు. చెన్నైకి చెందిన అనీష్ నాయర్ అనే వ్యక్తి 2018లో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై, బెంగుళూరులతో పాటు పలు ముఖ్య నగరాలలో శ్రీదేవి పేరు మీద ఓ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించనున్నాడు. ఈ విషయాన్ని ఆయన మీడియాకి తెలిపాడు.
ఈ ఇన్‌స్టిట్యూట్‌కి శ్రీదేవి పేరు పెట్టుకుంటానని ఆయన స్వయంగా వెళ్లి శ్రీదేవిని కలిసి ఆమె నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందాడట. ఇక ఇందులో ఆయన నటన మీద ఆసక్తి ఉండి కూడా డబ్బులు లేని మూలంగా యాక్టింగ్‌లో శిక్షణ పొందలేకపోతున్న పేద విద్యార్దులకు కూడా ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాడు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్ధులకు నటనలో, డ్యాన్స్‌ల వంటి వాటిలో, మొహంలోనే అభినయం ప్రదర్శించడం ఎలా? అనే వాటిని కేవలం శ్రీదేవి నటించిన సినిమాలు, ఆమె పాటలు, ఆమె అభినయించిన విధానాలను రిఫరెన్స్‌గా చూపిస్తూ విద్యార్ధులకు నటనలో శిక్షణ ఇస్తాడట.
ఈ విషయం తెలిసిన శ్రీదేవి సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వీలున్నప్పుడల్లా ఆ ఇన్‌స్టిట్యూట్స్‌కి వచ్చి ఆమె విద్యార్ధులకు స్పెషల్ గైడెన్స్‌ని ఇవ్వనుంది. అలాగే విదేశాలకు చెందిన సినీ ప్రముఖులను కూడా పిలిచి శ్రీదేవి రిఫరెన్స్‌ల ద్వారా క్లాస్‌లు కండక్ట్ చేయడానికి ఆయన సమాయత్తం అవుతున్నాడు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లుగా, ఎవరి వీరాభిమానం వారిది. కొందరు విగ్రహాలు, ఫొటోలు పెట్టి గుళ్లు కడితే మరికొందరు తమకు నచ్చిన విధంగా తమ వీరాభిమానం చూపిస్తుంటారు.