నాడు ప్రజారాజ్యం పార్టీలో జరిగిన తప్పులనే మరలా మరలా పవన్ చేస్తున్నాడా అంటే అవుననే అనిపిస్తోంది. చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీని పెట్టినప్పుడు పవన్ కాంగ్రెస్‌ని ఉద్దేశించి పంచెలు ఊడేదాకా వదిలిపెట్టవద్దని చెప్పాడు. నాడు చిరంజీవి కూడా కాంగ్రెస్, టిడిపిలకు వ్యతిరేకంగానే తన రాజకీయ ఉపన్యాసాలను దంచాడు. దాంతో రాజకీయంగా కొత్త వ్యక్తి కావడంతో ఈయనైనా మనల్ని పట్టించుకుంటాడేమోనని లక్షలాది మంది ఆయనను, ఆయనపార్టీని నమ్మి ఓట్లు వేశారు. కేవలం ఆయన సామాజిక వర్గమే కాకుండా న్యూట్రల్ ఓట్లు కూడా చిరంజీవికి పడ్డాయి. అవ్వన్నీ నాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నెగటివ్ ఓట్లేనని అందరికీ తెలుసు. కానీ లక్షలాది మంది తనను, తన పార్టీని చూసి ఓట్లు వేస్తే తీరా ఆయన విమర్శించిన కాంగ్రెస్‌లోనే తన పార్టీని విలీనం చేసి సోనియాగాంధీ కాళ్ల దగ్గర తనకు ఓట్లు వేసిన వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. ఇదేమీ సినిమా కాదు. కేవలం హీరో, నిర్మాత, దర్శకుల ఓన్ ప్రాపర్టీ కాదు. సినిమా అనేది పర్సనల్ ప్రాపర్టీ కాబట్టి ఆయనను సినిమాల విషయంలో వ్యతిరేకించడానికి వీలులేదు. కానీ రాజకీయ పార్టీ అనేది ఓట్లేసిన ప్రజల సొత్తు. ఇది కేవలం చిరంజీవి వ్యక్తిగత వ్యవహారం కాదు.
నాడు శ్రీశ్రీ చెప్పినట్లు మీరు సెలబ్రిటీలు కానప్పుడే మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక్కసారి జనాలలోకి వచ్చి తప్పు చేస్తే కడిగేస్తాం అని చెప్పాడు. అలా చిరంజీవి తన పార్టీ ఎమ్మెల్యేలకు పదవుల కోసం, తనకు కేంద్రంలో రాజ్యసభ ఎంపీ, కేంద్రమంత్రి పదవి కోసం రాజీపడ్డాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అప్పుడు పవన్ 'కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్' అన్నాడు. ఇప్పుడు 'జనసేన' అంటున్నాడు. పీఆర్పీలో జరిగిన తప్పులను మరోసారి జరగకుండా చూసుకుంటానని పవన్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన పక్కన ఉన్న మంది మార్బలం, పలు ప్రాంతాల జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే బాధ్యత జి.వి. సుధాకర్‌నాయుడు వంటి వారికి ఇవ్వడం దురదృష్టకరం.
తాజాగా ఆయన జనసేన కార్యకర్తలను చూసి అంతా తానైపోయి రెచ్చిపోయి ప్రసంగించాడు నమ్మినా త్రివిక్రమ్ వంటి వారిని నమ్మవచ్చు గానీ ఈ జీవీలను, బండ్లని నమ్మితే నాటి పీఆర్పీలో పెత్తనం చెలాయించిన స్వామినాయుడు, అల్లుఅరవింద్‌ల లానే పరిస్థితి తిరగబడుతుంది. దీనిపై విమర్శకుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు కాస్త పవన్ ఫ్యాన్స్‌కి మింగుడు పడకపోయినా ఆలోచించే విధంగానే ఉన్నాయి. పీఆర్పీకి ద్రోహం చేసినవారిని గుర్తించుకున్నానని, వారిని ఏరివేస్తానని చెప్పిన పవన్ అసలు పీఆర్పీకి ఓట్లేసిన ప్రజలకు, ఆ పార్టీకి చేసిన ద్రోహం మీ అన్న సంగతి ఏమిటి? ఇక పవన్ కొత్తరక్తం.. కొత్త రాజకీయాలు కావాలంటున్నాడు. మరి పార్టీ ఆఫీస్‌ని సినిమా ఆఫీస్‌గా మార్చడం, ప్రజాప్రస్థానాన్ని ఆడియో వేడుక జరిపినట్టు జరపడమేనా? కొత్త రాజకీయాలంటే అని మహేష్ ఎద్దేవా చేశాడు. ఇక పార్టీ విధానాల పరంగా ప్రజారాజ్యానికి, జనసేనకి పెద్దగా తేడా లేదని ఆయన చేసిన వ్యాఖ్య కూడా నిజమే. ఇక పవన్ అభిమానులతో మరోసారి ఢీకొట్టడానికి తాను రెడీ అని, తమప్రవర్తన, మైండ్ సెట్ మార్చుకుంటారో లేదో అన్నది పవన్ అభిమానుల ఇష్టమని చెప్పాడు...!