రోజాని వైసీపీ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు ఫైర్‌బ్రాండ్‌గా గొప్పలు చెబుతూ ఉంటారు. కానీ ఆమె చేసే విమర్శలు బజారు మనుషులు చేసే వ్యాఖ్యల కన్నా తక్కువ స్థాయిలో దిగజారి మాట్లాడటం, ఏ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడే వారికి ఫైర్ బ్రాండ్ బిరుదు ఇస్తే ఇక మనదేశంలో నన్నపనేని రాజకుమారి, రేణుకాచౌదరి వంటి నేలబారు వ్యాఖ్యలు చేసే వారికే మనం పట్టం కడుతున్నామేమో అనిపిస్తోంది. ఇక రోజా గౌరవనీయమైన ఎమ్మెల్యేగా ఉంటూ అసెంబ్లీ సాక్షిగా చేసిన తీవ్ర పదజాలంతో కూడిన విమర్శలు, సంజ్ఞలు ఆమె సంస్కారం ఏపాటిదో అందరికీ అర్ధమయ్యేలా చేస్తాయి. ఇక అలా మాట్లాడటం, సంజ్ఞలు చేయడమే ఫైర్‌బ్రాండిజం అనుకుంటే అది ప్రజల మూర్ఖత్వమే అవుతుంది. ఇక ఈమె తన విమర్శలలో లాజిక్‌లు, హేతుబద్దత వదిలేసి కేవలం ప్రాస కోసం పాకులాడుతూ ఉంటుంది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన' కాదు.. టీడీపీ భ'జనసేన' అని వ్యాఖ్యానించింది. చంద్రబాబుకి తల్లి టిడిపి అయితే పవన్‌ది పిల్ల టీడీపీ అని ఎద్దేవా చేసింది. మరి కాంగ్రెస్‌ది పెద్ద కాంగ్రెస్ అయితే వైసీపీది 'పిల్ల కాంగ్రెస్' అనే విమర్శలను ఆమె మాత్రం మర్చిపోయింది. ఇక అనుభవం లేని వారు ముఖ్యమంత్రులు కావడం ఏమిటని? పవన్ ప్రశ్నిస్తున్నాడు.
మరి మామకి వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులు విసిరిన వారు ముఖ్యమంత్రి కావచ్చా? ఏ అర్హతలేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలవకుండానే ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇవ్వవచ్చా? అనే పాయింట్‌పై పవన్‌కి కౌంటర్ వేసింది. కాగా పవన్ తాజాగా తాను టిడిపి, వైసీపీ, బిజెపి.. ఇలా తాను ఏ పార్టీ పక్షమో కాదని, తాను ప్రజల పక్షమని తెలిపి, వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని ప్రకటించాడు. అదే సమయంలో లోకేష్‌కి ఏం అర్హత ఉంది? ఆయనకు ఆయన తండ్రి ఇచ్చినట్లు తనకు పాల ఫ్యాక్టరీలను తన తండ్రి ఇవ్వలేదని పవన్ లోకేష్‌పై కూడా విరుచుకుపడిన విషయాన్ని ఆమె విస్మరించింది.
అయినా రోజాతో పాటు పలువురు ఇప్పుడు చంద్రబాబుని మామపైకి చెప్పులు వేశాడు. వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడుతున్నారు. మరి వీరికి ఇప్పుడే ఎన్టీఆర్ గుర్తుకు వచ్చాడా? వీరంతా ఇంతగా ఎన్టీఆర్‌పై సానుభూతిని ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నారు? అనేది ప్రశ్న. ఇక పవన్ వారసత్వ రాజకీయాలపై మాట్లాడటం మానేసి వారసత్వ సినిమాలపై మాట్లాడమని చెప్పడం మాత్రం వాలిడ్ పాయింట్‌గా అనిపిస్తుంది. మరోవైపు చిరంజీవి వల్లే పవన్ హీరో అయ్యాడని, పవన్ వల్లనే ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి నష్టపోయాడని ఆమె మరో వాదన తీసుకుని వచ్చింది. అయితే పవన్ వల్ల ప్రజారాజ్యంకి మైనస్ జరిగిందనేది వాస్తవం కాదు. కేవలం చిరంజీవి స్వయంకృతాపరాధం, తొందరపాటుతనమే ప్రజారాజ్యాన్ని కొంప ముంచాయి. ఇలా చూసుకుంటే అసలు రోజా వాదనలో తర్కమే కనిపించడం లేదు...!