సినిమా కథలను, దర్శకులను ఎంచుకోవడంలో సూర్యకి గతంలో మంచి జడ్జిమెంట్ ఉండేది. ఆయన నటించిన 'గజిని' అయితే అన్నిభాషల్లో సంచలనం సృష్టించి తెలుగులో సూర్యని స్టార్ చేసింది. ఆ తర్వాత సింగం సిరీస్‌లోని మొదటి రెండు భాగాలు పెద్ద హిట్టయ్యాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఆయనకు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా చెప్పుకోదగిన హిట్ లేదు. 'సికిందర్' ముందు నుంచే ఆయన చిత్రాలన్నీ బోల్తాపడుతున్నాయి. అప్పటికీ ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలనే కాదు.. మరలా సింగం సిరీస్ రెండు భాగాలతో తనను ఫ్లాప్‌లో ఉన్నప్పుడల్లా హిట్‌ని అందించే దర్శకుడు హరి కూడా 'ఎస్3' విషయంలో ఏమీ చేయలేకపోయాడు. '24' చిత్రం తమిళం కంటే తెలుగులో బెటర్ అనిపించే రిజల్ట్‌ని సాధించింది.
తెలుగులో సూర్య కొత్తదనం సినిమాలు చేస్తాడనే పేరుతో పాటు ఈ చిత్రానికి విక్రమ్‌కె.కుమార్ దర్శకుడు కావడంతో ఇక్కడి ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కానీ తమిళంలో మాత్రం ఆయన ఫ్లాప్‌ల జడివాన నుంచి బయటపడలేకపోతున్నాడు. దాంతో తమిళంలో అసలు ఆయన స్టార్‌డమ్ మీదనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అజిత్, విజయ్‌వంటి వారి సినిమా బిలో యావరేజ్ అయినా భారీకలెక్షన్లు కొల్లగొడుతూ నిర్మాతలను, బయ్యర్లను సంతృప్తిపరుస్తున్నారు. కానీ సూర్య మాత్రం కేవలం తన భుజానే నడిపే చిత్రాలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు. ఆయన ఫ్యామిలీయే సినిమా ఫ్యామిలీ కాబట్టి ఆయనకు కథ, దర్శకుల విషయంలో మంచి గైడెన్సే ఉంది. ఇక తన కజిన్ స్టూడియోగ్రీన్ అధినేత జ్ఞానవేల్‌రాజా వంటి హోమ్ బ్యానర్ ఉంది. అయినా ఏ దర్శకులు, కథలు కూడా ఆయనకు విజయాన్ని అందించడం లేదు. ఆయనకు గతంలో మంచి హిట్స్ ఇచ్చిన గౌతమ్‌మీనన్, మురుగదాస్‌లతో కూడా ఆయనకు విభేదాలు వచ్చాయని, అందుకే వారు సూర్యని పట్టించుకోవడం లేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ప్రస్తుతం ఆయన ఆశలన్నీ జనవరి 12న విడుదల కానున్న 'తానాసేంద్రకూట్టమ్' పై ఉన్నాయి. దీనికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కీర్తిసురేష్, రమ్యకృష్ణ వంటి వారు ఉండటంతో కాస్త నమ్మకం కలుగుతోంది. ఈ చిత్రం అదే రోజున తెలుగులో 'గ్యాంగ్' పేరుతో విడుదల కానుంది. ఆ తర్వాత సూర్య సెల్వరాఘవన్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. సెల్వరాఘవన్ కూడా ఇప్పుడు అంత ఫేమ్‌లో లేడు. ఇక తాజాగా సందీప్‌కిషన్‌తో 'నగరం' తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి అవకాశం ఇచ్చాడు. 'నగరం' చిత్రం తమిళ వాసనలతో ఉండటంతో ఇది మన తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. మరి ఆయనకు చాన్స్ ఇస్తే సూర్య చిత్రం కూడా తమిళవాసనలతో ఉండి తెలుగులో పెద్దగా క్రేజ్ రాకపోవచ్చు. మరి సూర్య.. సెల్వ, లోకేష్‌లలో ముందుగా ఎవరి సినిమాని ముందుకు తీసుకెళ్తాడో చూడాలి..!