పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు త్రివిక్రమ్, పవన్ వెంట వున్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? పవన్ - త్రివిక్రమ్ కలిసి జల్సా సినిమా చేసినప్పటి నుండి వీరి మధ్యన దర్శక హీరో బంధం కాస్తా.. స్నేహబంధంగా మారిపోయింది. అప్పటినుండి పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటున్నాడు త్రివిక్రమ్. పవన్ ఎక్కడ ఉంటే త్రివిక్రమ్ అక్కడ ఉండడం దగ్గరనుండి.. అన్ని విషయాల్లోనూ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కి మంచి ఆప్తుడిగా దగ్గరయ్యాడు. కేవలం సినిమాల్లోనే కాదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుండి పవన్ వెనుక త్రివిక్రమ్ ఉన్నాడు. పవన్ మాట్లాడే ప్రతి మాట త్రివిక్రమ్ చేతి రాతే అని ప్రచారం జరిగింది అక్షరాలా నిజం.
అందుకే త్రివిక్రమ్ ని మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందనే ప్రచారం కూడా జరిగింది. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాల్తో బిజీగా ఉంటూనే మరోపక్క రాజకీయాల్లో బిజీగా మారుతున్నాడు. 2019 ఎన్నికలను టార్గెట్ గా జనసేన కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్ గా మారడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పాదయాత్ర కూడా చేపట్టబోతున్నాడు. అందులో భాగంగానే.. చలోరే చలోరే చల్... జనం లోకి జనం కోసం జనసేనాని అంటూ పవన్ కళ్యాణ్ బయలుదేరాడు.
ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రభుత్వం మీద పోరాడుతున్న పవన్ కళ్యాణ్ బలిదానాలు బాధాకరమన్నాడు. అందులో భాగంగానే ఓయూ విద్యార్థి మురళి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమస్యలపై అధ్యయనం, అవగాహన కోసం తొలి విడత పర్యటన ఉపయోగపడుతుందని, రెండో విడత పర్యటనలో ప్రభుత్వ బాధ్యతను తెలియజేస్తామని పవన్ అన్నారు. మూడో విడత పర్యటనను పోరాట వేదికగా మారుస్తామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో యువత నిరాశ, నిస్పృహలతో ఉన్నారని, యువతను జాగృత పరచడానికి ఛలో రే ఛలో గీతాన్ని విడుదల చేశామని పవన్ జనసేన పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశాడు.
అయితే పవన్ కళ్యాణ్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే అంటూ పాట మొదట్లో... ముందుగా పవన్ కళ్యాణ్ ఆప్తుడు, మిత్రుడు అయిన త్రివిక్రమ్ వాయిస్ ఆ ఆడియో లో స్పష్టంగా వినబడుతుంది. ఆ ఆడియో మొదట్లో త్రివిక్రమ్ వింటారా! వెనకాలే వస్తారా! తోడుగఉందాం వస్తారా! రండి విందాం.... అటూ చెప్పగా.. పవన్ కళ్యాణ్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్.. మిత్రమా! అసలే చీకటి! ఇల్లేమో దూరం! దారంతా గోతులు! చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం... రా అంటూ గర్జిస్తూ...ఒక దేశపు సంపద నదులు కాదు... ఖనిజాలు కాదు.. అరణ్యాలు కాదు.. కలలు ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశపు భవిష్యత్తుకు నాయకులు.
మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వారికి ఇదే చెబుదాం. పర్వతం ఎవరిముందు వంగి సలాం చెయ్యదు. నేను పిడికిలంతా మట్టే కావచ్చు.. కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా మోసేంత పొగరుంది అంటూ ఆవేశపూరితమైన మాటలు వింటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయి రాజకీయనాయకుడిలా కనబడుతున్నాడు. మరి త్రివిక్రమ్ వాయిస్, గుంటూరు శేషేంద్ర శర్మ కవి పలుకులు.. పవన్ పవర్ వాయిస్ కలిసి వచ్చిన ఈ.. ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ సాంగ్ వింటుంటే రోమం నిక్కబొడుచుకోవడం ఖాయం.