సినీ పెద్దలు కొన్ని సార్లు చిత్రవిచిత్రంగా మాట్లాడుతారు. ప్రభుత్వం తమకేమీ చేయడం లేదని చెబుతారు. బహుశా వారికి బాగా ఆర్ధిక లాభం కలిగేలా విలువైన భూములను, స్థలాలను, స్టూడియోలకు, ఇతర వాటిని ఇస్తే గానీ వీరు సామాన్యంగా ఎక్కడా అడుగుపెట్టరు. వీరి దేశభక్తి, ప్రాంతీయ భక్తిని దీనిని బట్టే నిర్ణయించుకోవచ్చు. నాడు మద్రాస్‌లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ప్రముఖులందరికీ స్టూడియోలకు, ఇతర వసతులకు నామమాత్రపు రేటుకి, కొన్నింటికైతే ఏకంగా ఉచితంగా స్థలాలు ఇస్తే గానీ మన పెద్దలు మద్రాస్ వదిలిరావడానికి సిద్దపడలేదు. నాడు స్టూడియోలు, ఇతర సినీ మౌళిక వసతుల కోసం ఇచ్చిన స్థలాలు నేడు కోట్లాదికోట్లు పలుకుతున్నాయి. స్టూడియోల కోసం తీసుకున్నామని, సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌లో ఉద్దరించడానికే మద్రాస్ నుంచి హైదరాబాద్‌కి వచ్చామని చెప్పిన పెద్దలు ఎప్పుడైతే ఆ భూముల విలుప పెరిగిందో వాటినే కమర్షియల్ విషయాలకు కూడా వాడుకుంటూ తమ కష్టార్జితంగా ఫీలవుతూ, ప్రభుత్వం నుంచి పొందాల్సిన రాయితీలు, స్థలాలు అన్ని తీసుకుని మరలా మేము ఇండస్ట్రీ కోసం కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతంలో సినీ పరిశ్రమని ఉద్దరించడానికే వచ్చామని చెబుతుంటారు.
విదేశాలలోని తెలుగు ఎన్నారైలు వచ్చి ఇక్కడ సంస్థలు స్థాపించి, తమ అభిమానాన్ని చూపిస్తుంటే సినీ పెద్దలు మాత్రం హైదరాబాద్‌లో తమకు ఉన్న విలువైన భూములను కాపాడుకోవడం కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా సినీ పెద్దగా చెప్పుకునే తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, మేమంతా హైదరాబాద్‌లో ఎంతో ఆనందంగా ఉన్నాం. ఏపీలో ప్రభుత్వం రాగానే మాకేదో చేస్తుందని భావించాం. కానీ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. బహుశా సినీ పరిశ్రమ వైజాగ్ వంటి చోటికి రావడం ఈ ప్రభుత్వానికే ఇష్టం లేదేమో? వారికి ఇంట్రస్ట్‌లేనప్పుడు మేమెందుకు హైదరాబాద్ విడిచిరావాలి? అని ప్రశ్నించాడు.
అంటే వైజాగ్‌లోని విలువైన కోట్లాది రూపాయల భూములను ఇస్తే తప్ప వీరు హైదరాబాద్ నుంచి ఏపీకి రారా? ఇన్‌డైరెక్ట్‌గా ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? వైజాగ్, అమరావతి వంటి చోట ఉన్న విలువైన భూములు కాకుండా నాటి ప్రభుత్వం హైదరాబాద్‌లో పరిశ్రమ స్ధిరపడేందుకు కొండలు, గుట్టలు ఉన్న స్థలాలను ఇచ్చినట్లే వీరికి దొనకొండ వంటి ప్రదేశాలలో స్థలాలు ఇస్తే వస్తారా? రారు.. అదే వైజాగ్, అమరావతి వంటి చోట్ల అయితే వస్తారనేది ఆయన భావన. దీన్ని బట్టి వీరికి ఏపీపై ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోంది.