జంధ్యాల చిత్రాలలో కూడా ఎదుటివారిని ఎగతాళి చేసే కామెడీ ఉండేదని, ఆనాటి నుంచి అంటే పాతకాలం నుంచి దానినే హాస్యం అంటున్నారని కొందరు వాదిస్తారు. జంధ్యాల చిత్రాలలో హాస్యం ఎలా ఉన్నా.. దేనిపైన ఉన్నా అది మోతాదులో, సున్నితంగా ఉండేది. నాటి హాస్యం సున్నితత్వంతో ఉంటే నేటి హాస్యం సుత్తిమోదుతనంతో ఉంటోంది. ఆ మద్య మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంపై బ్రాహ్మణులు మండిపడ్డారు. అందులో శాకాహారులైన బ్రాహ్మణులు పాయసం బదులు హలాల్ తిని బాగుందని పొగిడేలా సీన్స్ రాసుకున్నారు. ఇక ఇందులో ఓ పండితుని భార్య ఎదుట ఏ మగాడు కనిపించినా 'ఏవండీ' అని కౌగిలించుకునే సీన్స్ చూపించారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆ చిత్రానికి పనిచేసిన దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి, మోహన్‌బాబు వంటి వారు ఇలాంటి సన్నివేశమే జంధ్యాల చిత్రంలో ఉందని, దానిని తప్పు పట్టనప్పుడు మా చిత్రాన్నే ఎందుకు తప్పుపడతారని వాదించారు.
కానీ జంధ్యాల తీసిన ఆ చిత్రంలో బ్రాహ్మణుడైన బ్రహ్మానందంకి భార్యగా నటించిన శ్రీలక్ష్మి చిన్నతనంలోనే చనిపోయిన తన కుమారుడిని తలుచుకుంటూ అందరినీ తన బిడ్డలా భావిస్తూ.. బాబూ అని కౌగిలించుకుని ఆప్యాయత చూపుతుంది. అందులో హాస్యంతో పాటు ఓ తల్లి పుత్రశోకం అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఈ తేడా మన వారు గమనించడం లేదు. ఇక ఎంతో మేధావి, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని అయిన దివంగత పీవీ నరసింహారావు సైతం తనకి మనసు బాగాలేనప్పుడు రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసి నవ్వుకుని రిలాక్స్ అయ్యేవాడు.
ఆ నటకిరీటీ నేటి హాస్యంపై మాట్లాడుతూ.. నాటీరోజుల్లో సంసారపక్షమైన కామెడీ ఉండేది. కానీ నేడు అది శృతిమించి రాగాన పడుతోంది. జంధ్యాల, బాపు, రేలంగి నరసింహారావు వంటి ఎందరో మహానుబాహువులతో పనిచేశాను. వారు ఎంతో ఆరోగ్యకరమైన హాస్యం పండించేవారు. తమ హాస్యం ద్వారా కుటుంబసమేతంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ థియేటర్‌కి రప్పించేలా హాస్యాన్ని పండించేవారు. నేడు టీవీలలో, సినిమాలలో వస్తున్న హాస్యంపై పలువురు నన్ను నిలదీస్తున్నారు. మెటీరియల్ అయిపోయిన వారే అలాంటి కామెడీలు తీస్తారు. ఇంటిల్లపాది చూసేలా హాస్యం ఉండాలి. అలాంటి ఆరోగ్యకరమైన హాస్యం చేయాలని నటీనటులను, దర్శకులను, దేవుడిని ప్రార్ధిస్తున్నానని చెప్పారు.ఈ మాటలు వింటేనైనా 'జబర్ధస్త్' షో వారికి జ్ఞానోదయం అవుతుందేమో చూద్దాం!