శింబుకి వివాదాలేమి కొత్తకాదు. ఆయన నయనతార, హన్సికలతో నడిపిన ఎఫైర్, ఇక మహిళలను ఉద్దేశించి పాడిన బీప్‌సాంగ్, తాజాగా కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన పాడిన పాట.. ఇలా ప్రతిది ఓ వివాదమే. అయినా ఇంతవరకు ఆయనపై వచ్చిన వివాదాలు ఆయనకు వ్యక్తిగతంగా మాత్రమే నష్టాన్నికలిగించాయి. కానీ ప్రస్తుతం వచ్చిన కొత్త వివాదం ఆయన కెరీర్‌ని కూడా నాశనం చేసేలా ఉంది. శింబు హీరోగా వచ్చిన 'ఎఎఎ' చిత్రం నిర్మాత మైఖేల్ రాయప్పన్ శింబు వంటి అన్‌ప్రొఫెషనల్ నటుడుని చూడలేదని, ఆయన బిహేవియర్ వల్ల తమకు 20కోట్ల వరకు నష్టం వచ్చిందని, ఆయన నుంచి పరిహారం ఇప్పించడమే కాదు.. సినిమాలలో ఆయన్ను బ్యాన్ చేయాలని ప్రెస్‌మీట్‌పెట్టి మరీ చెప్పాడు. ఆ చిత్రం దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కూడా నిజమేనని మద్దతు పలకడంతో ఇప్పుడు శింబు చిక్కుల్లో పడ్డాడు. అసలు త్రిష నుంచి ఎందరో హీరోయిన్లు శింబు సరసన నటించమని చెబుతున్నారని నిర్మాత ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
దీనిపై స్పందించిన శింబు తనకి ఈ వివాదంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, తమిళ నిర్మాతల మండలి నుంచి తనకు ఎలాంటి రెడ్ కార్డు రాలేదని, తనకు నిర్మాత ఇంకా పారితోషికం ఇవ్వాలని, దానిమీద ఇప్పటికే నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశానని అంటున్నాడు. ఇక ఈ నిర్మాత ఫిర్యాదు పరిష్కారం అయ్యేదాకా శింబుని మరో సినిమాలో పెట్టుకోకుండా నిషేధం విదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా రెడ్‌కార్డ్ ఇవ్వకపోయినా ఆయనతో సినిమాలు తీయడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. మణిరత్నం కూడా తన చిత్రం నుంచి ఆయనను తొలగించాడు.