మెగామేనల్లుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన సాయిధరమ్‌తేజ్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'జవాన్' విడుదలై మిక్స్‌డ్‌టాక్ సంపాదించుకుంది. అయినా తేజూ తన నటనతో మాత్రం అందరినీ మెప్పించాడు. 'జై' పాత్రలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, దేశం కోసం ప్రాణాలైనా అర్పించే యువకుని పాత్రలో ఆయన చేసిన నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. దేశంకోసం, కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్దమయ్యే పాత్రలో ఆయన చూపించిన నటన, ఎమోషన్స్‌ని పలికించిన విధానం, ఇక ఎప్పుడు తనదైనశైలిలో ఉండే యాక్షన్ సీన్స్‌లో, డ్యాన్స్‌లతో అలరించాడు.
ఇక తాజాగా సాయిధరమ్‌తేజ్ చేతిలో వినాయక్, కరుణాకరన్ చిత్రాలతో పాటు వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకునిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్‌యేలేటితో కూడా ఓ చిత్రం ఒప్పుకున్నాడని తెలుస్తోంది. తాజాగా సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ, నేను ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఏదైనా ఉద్యోగం చేయాలని భావించాను. నా స్నేహితుని ఆఫీస్‌కి వెళ్లి రెండు రోజులు పనిచేశాను. కానీ గిరి గీసుకుని ఏకంగా ఏడెనిమిది గంటలు ఒకే చోట పనిచేయడం నాకు నచ్చదని అర్దమైంది. అప్పటికీ ఇంకా నేను సినిమాలలోకి రావాలని, వాటిపై దృష్టి పెట్టలేదు. దాంతో బాగా ఆలోచించాను. దాంతో జ్వరం వచ్చి రెండు రోజులు ఇంట్లో నుంచి కదలలేకపోయాను. బక్కగా తయారైయ్యాను. దాంతో మా అమ్మ నేను డ్రగ్స్‌కి బానిసైపోయానని భావించి భయపడిపోయింది.
కేవలం బ్యాగ్రౌండ్ ఉంటే చాలదనిపించింది. నా చదువు విషయంలో మా పెద్దమామయ్య ఎంతగా శ్రద్ద తీసుకున్నారో, సినిమాల విషయంలో చిన్న మావయ్య పవన్ అంత శ్రద్దతీసుకున్నారు. ఆయనని అడిగి నటనలో ఎక్కడ శిక్షణ తీసుకోవాలి? ఏమిటి? అనే అన్ని విషయాలలో ఆయన గైడెన్స్‌ని తీసుకున్నాను. ఇక నేను నటించిన మొదటి చిత్రం 'రేయ్' విడుదలకు ఇబ్బంది పడటం, అదే సమయంలో చేసిన పిల్లా నువ్వులేని జీవితం చిత్రంలో నటిస్తున్న శ్రీహరిగారు హఠాత్తుగా మరణించడంతో అందరు నన్ను ఐరన్‌లెగ్ అన్నారు. ఆ తర్వాత నాదైన శైలిలో చిత్రాలు చేస్తున్నాను అని తెలిపాడు.