'చెప్పను బ్రదర్' అన్న దగ్గర నుంచి పవన్‌కళ్యాణ్ అభిమానులు బన్నీపై మండిపడుతూనే ఉన్నారు. ఇక పవన్ ఎక్కువగా తన అభిమానుల మాటలకే విలువ ఇస్తాడనేది తెలిసిందే. దాంతో పవన్ కూడా ఎక్కడా బన్నీ పేరుగానీ, ఆయనను కలుసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. ఈ విషయంలో బన్నీ చేత పవన్‌కి సారీ చెప్పించాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పినా, అల్లుఅర్జున్, ఆయన తండ్రి అల్లుఅరవింద్‌లు కూడా ఆ మాటను వినకుండా తమ పంతాలలో తామున్నారు. 'డిజె'లోని ఓ పాటను పవన్ చేత రిలీజ్ చేయిద్దామని దిల్‌రాజు, దర్శకుడు హరీష్‌శంకర్‌లు సూచించినా బన్నీ నో చెప్పాడని సమాచారం. ఇక ఇప్పటికీ వారి మద్య గ్యాప్ ఉంది. ఈ వివాదం చెలరేగి ఇంత కాలమైన పవన్ అభిమానులు కూడా చల్లారలేదు.
ఇక బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఆయన చిత్రాలు అక్కడ భారీగా విడుదల కావడమే కాదు. అక్కడి హీరోల స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంటాయి. ఇక బన్నీ పేరు చెప్పుకుని ఆల్‌రెడీ ఆయన సోదరుడు అల్లుశిరీష్.. మోహన్‌లాల్‌తో చిత్రం చేస్తున్నాడు. ఇక రామ్‌చరణ్ కూడా 'ఎవడు'లో బన్నీ చేత క్యారెక్టర్ చేయించి, దాని ద్వారా మలయాళంలో క్రేజ్ తెచ్చుకోవాలనే యత్నం చేశాడు. ఇక విషయానికి వస్తే పవన్ కేవలం తెలుగు సినిమాలలో నటించినా కూడా ఆయనకు శాటిలైట్, సోషల్‌మీడియా, డిజిటల్ రైట్స్ ద్వారా నార్త్‌లోనే కాదు సౌత్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. 'సర్దార్‌గబ్బర్‌సింగ్' ప్రయత్నం విఫలమైనా సరే ఆయన ఆ తర్వాత నటించిన 'కాటమరాయుడు' చిత్రం తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టింది. ఇక ఈ చిత్రం మలయాళంలోకి అనువాదమై మంచి ఆదరణ పొందింది. ఆయన యాక్షన్ సీన్స్, మేనరిజమ్స్ అక్కడి వారిని బాగా ఆకట్టుకున్నాయి.
దాంతో పవన్ తన తదుపరి చిత్రం 'అజ్ఞాతవాసి'ని కూడా అదే పేరుతో మలయాళంలోకి డబ్ చేసి తెలుగుతో పాటు మలయాళంలోనూ జనవరి 10వ తేదీనే భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందిస్తుండటంతో పాటు ఇందులో నటిస్తున్న హీరోయిన్లయిన కీర్తిసురేష్, అనుఇమ్మాన్యుయేల్‌లు కూడా మలయాళీలు. అక్కడ వారికి క్రేజ్ ఉంది. ఇవ్వన్నీ పవన్ 'అజ్ఞాతవాసి'కి మలయాళంలో క్రేజ్ తేవడంతో సక్సెస్ అవుతాయని భావిస్తున్నారు. మొత్తానికి మల్లూ అర్జున్‌కి పోటీగా మల్లు పవన్ ఖచ్చితంగా మాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు.