సినీ ప్రేక్షకుల్లో, జనాలలో నటీనటులు, వారు వాడే కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్ నుంచి అన్నింటికీ ఎంతో క్రేజ్ ఉంటుంది. పాత కాలంలో వాణిశ్రీ కట్టే చీరల పేరుతో వచ్చేచీరలు విపరీతంగా అమ్ముడుపోయేవి. ఇక చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌లీడర్' దుస్తులు, 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలో వాడిన బ్యాగీ ప్యాంట్లు వంటివి నాడు ఎంతో ఫేమస్. ఇక హీరోలకి ఉండే హెయిర్‌స్టైల్స్, గడ్డాలు వంటివి కూడా ఎందరో ఫాలో అవుతుంటారు. నాగార్జున 'శివ' షర్ట్స్, 'గీతాంజలి' హెయిర్‌స్టైల్‌తో పాటు ఇటీవల ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' గెటప్, గడ్డం, హెయిర్‌స్టైల్, 'అర్జున్‌రెడ్డి' చిత్రంలోని విజయ్‌దేవరకొండ మేనరిజమ్స్ నుంచి అన్ని యూత్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక చిరు విషయానికి వస్తే ఆయనకు ఓ చోట తిన్న దోశ విపరీతంగా నచ్చింది. దాంతో దానిని ఎలా చేస్తారో నేర్చుకుని తన శ్రీమతికి నేర్పించాడు. ఇదే దోశ కోసమే తాను 'ఖైదీనెంబర్ 150' చిత్రంలోని పాటకి ఫ్రీగా కొరియోగ్రఫీ చేశానని, ఆ దోశ అంటే తనకెంతో ఇష్టమని రాఘవలారెన్స్ కూడా చెప్పాడు. ఇక ఈ దోశ పేటెంట్ హక్కుల పేరిట హైదరాబాద్‌లోని చట్నీస్ రెస్టారెంట్‌లో ఇప్పటికీ చిరంజీవి దోశను సప్లై చేస్తుంటారు. తాజాగా చిరంజీవి కోడలు, రామ్‌చరణ్ శ్రీమతి ఉపాసన మరోసారి ఇలాంటి క్రేజ్‌ని, తన మామయ్య ఇమేజ్‌ని వాడుకోవాలని డిసైడ్ అయింది.
అపోలో ఫౌండేషన్ తరపున ఓ కాఫీ కేఫ్‌ని ప్రారంభించింది. దీనిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఎఫ్‌ఎన్‌డి థియేటర్ వద్ద లాంచ్ చేశారు. ఇందులో ఉపాసన చిరు ఫిల్టర్ కాఫీ పేరుతో కాఫీ కేఫ్‌లో ఆయన పేరు మీద కాఫీని అందుబాటులో ఉంచింది. ఇక ఈ కేఫ్‌కి వచ్చి రిలాక్స్ అవ్వండి అని చెబుతూ, ఇందులో చిరు ఫిల్టర్ కాఫీతో పాటు ఎన్నో వంటకాలు లభిస్తాయని తెలిపింది. సో.. ఇక నుంచి చిరుదోశతో పాటు చిరు ఫిల్టర్ కాఫీ కూడా ఫేమస్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.