ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలోని పాటలను డైరెక్ట్ గా మార్కెట్ లోకి వదలడమో... లేకుంటే.. ఆడియో వేడుకని కానిచ్చేసి యూట్యూబ్ లో వదిలేయ్యడమో జరుగుతుంది. కానీ తాజాగా బాహుబలి సినిమా ఆడియో అని చెప్పలేం గాని పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'అజ్ఞాతవాసి' సినిమా పూర్తయ్యి ఆడియో వేడుక దగ్గరపడే సమయానికి మళ్ళీ కొన్ని ప్రముఖ సంస్థలు అజ్ఞాతవాసి ఆడియో రైట్స్ కోసం పోటీపడడం అది కాస్తా రికార్డు స్థాయిలో 2 కోట్లదాకా పలకడం.. అది చూసి సై రా సినిమా మొదలు కాకముందే ఆదిత్య మ్యూజిక్, లహరి మ్యూజిక్ లు నువ్వా నేనా అని పోటీ పడడం ... అందులో లహరి మ్యూజిక్ వెళ్లి చిరంజీవి సై రా నరసింహారెడ్డి ఆడియో హక్కులను దాదాపు 2.9 కోట్లకు దక్కించుకున్నారనడం.. చూస్తుంటే మళ్ళీ ఆడియోలకి మంచి రోజులు వచ్చాయనే అనిపిస్తుంది.
కేవలం అజ్ఞాతవాసి, సై రా నరసింహారెడ్డి మాత్రమే కాకుండా ఇప్పుడు మహేష్ - కొరటాల శివ కలయికలో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులు కూడా మంచి ధర పలికిందని న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులను కూడా ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి వారే చేజిక్కించుకున్నారని చెబుతున్నారు. అలాగే భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులు 1.9 కోట్లకు అమ్ముడు పోయాయంటున్నారు. మరి అజ్ఞాతవాసి కన్నా 10 లక్షలు తక్కువే అయినప్పటికీ ఆడియో హక్కులకు మంచి ధర రావడం అనేది సామాన్యమైన విషయం కాదు.
మరి ఇప్పటికే కొరటాల - మహేష్ - దేవిశ్రీ ప్రసాద్ లు శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ ను ఇచ్చి ఉండడంతో ఇప్పుడు మరోసారి అదే హిట్ కాంబినేషన్ రిపీట్ అవడంతో భరత్ అనే నేను సినిమా ఆడియో కి కూడా ఈ రేంజ్ లో ఆఫర్ తగిలిందంటున్నారు. ఏదిఏమైనా ఈమధ్య కాలంలో ఆడియో హక్కుల పరంగా చిరు సై రా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. పవన్ అజ్ఞాతవాసి సెకండ్ ప్లేస్ లో ఉండగా.. ఇప్పుడు మహేష్ భరత్ అనే నేను మూడో స్థానాన్ని ఆక్రమించింది.