లోకనాయకుడు కమల్‌హాసన్ త్వరలో సొంతగా రాజకీయ పార్టీని పెట్టి, ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానంటూ రాజకీయ పరమైన ప్రసంగాలు చేస్తూ, అలాంటి దుస్తులతోనే కనిపిస్తున్నాడు. ఇక ఈయన విషయానికి వస్తే గతంలో ఆయన 'విశ్వరూపం2, శభాష్‌నాయుడు, మరుదనాయగం' వంటి పలు చిత్రాలను చేస్తానని ప్రకటించాడు. కానీ ఇకపై లోకనాయకునికి అంతగా సమయం ఉండదనేది వాస్తవం. ఇక ఆయన తాను తీసిన 'విశ్వరూపం'లో తన భావాలను, ఆలోచనలను ప్రతిబింబించాడు. ఇక కొత్తగా మరలా 'శభాష్‌నాయుడు, మరుదనాయగం' తీయడం కంటే దాదాపు పూర్తయిన 'విశ్వరూపం 2'ని పూర్తి చేసి విడుదల చేయడమే బెటర్ అని భావించినట్లున్నాడు. ఎందుకంటే 'విశ్వరూపం 2' లో కూడా ఆయన తన ఆలోచనలకు వెండితెర రూపం ఇచ్చాడని తెలుస్తోంది.
ఈ విధంగా చూసుకుంటే తన పొలిటికల్‌మైలేజ్, టెర్రరిజం వంటి అంశాల కోసం ఆయన 'విశ్వరూపం 2' తో పాటు 'భారతీయుడు 2' మాత్రమే చేస్తాడని, మిగిలినవి చేయలేడని అర్ధమవుతోంది. ఇక 'విశ్వరూపం' సమయంలో ఇది ముస్లింల మనోభావాలకు వ్యతిరేకమని అందరు ఆయన్ను దుమ్మెత్తిపోశారు. నాటి ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆయన మీద ఉన్న కోపంతో ఆ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయకుండా నానా ఆటంకాలు కలిగించింది. అయినా ఈ చిత్రం బాగా ఆడింది. ఇక ఇప్పుడు కమల్ హిందూ తీవ్రవాదంపై మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ చిత్రం రెండో పార్ట్‌లో దానిపై చర్చించే అవకాశం ఉంది. ఈ చిత్రం టీజర్‌ని నిజానికి కమల్ బర్త్‌డే రోజున అంటే నవంబర్ 7న విడుదల చేయాలని భావించినా అది వీలుకాలేదు.
ఇక తాజాగా ఈ చిత్రంలో బ్యాలెన్స్ ఉన్న షూటింగ్‌ని చివరి షెడ్యూల్‌గా చెన్నైలో మొదలుపెట్టారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌లోని ఓ ఫొటోని కమల్ సోషల్‌మీడియాలో పెట్టాడు. ఇందులో తుపాకులు ధరించి, ఆర్మీ దుస్తులలో కమల్‌హాసన్, పూజాకుమార్, ఆండ్రియాలు కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా కమల్ 'మా తుఝే సలాం' అంటూ తన దేశభక్తిని ప్రకటించాడు. ఈ చిత్రం టీజర్, ఆడియోలను ఈ నెలలో విడుదల చేసి '2.0' రావాల్సిన జనవరి 26న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిపబ్లిక్‌డేగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.