మంచి ఎమోషన్స్ చిత్రాలను, వైవిధ్యభరితమైన కథలను, ఫీల్‌గుడ్ స్టోరీస్ కి ఈ మధ్య బాగా ఆదరణ లభిస్తోంది. కానీ మన స్టార్స్ మాత్రం కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్స్‌ని మించి పెద్దగా ముందుకు అడుగులు వేయడం లేదు. కానీ హృదయానికి హత్తుకునే కథలను వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దాంతో అలాంటి మూవీస్‌ని ఎక్కువగా శాటిలైట్ హక్కులు కొనడానికి ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. ఒకసారి ఆ చిత్రాన్ని థియేటర్‌లో చూసినా కూడా మరలా అదే చిత్రం బుల్లితెరపై ఎన్నిసార్లు వచ్చినా మనవారు వాటికి పట్టం కడుతూనే ఉంటారు. 'అత్తారింటికి దారేది, అతడు' వంటి చిత్రాలు ఆ కోవకి చెందినవే. కానీ అదే బాలకృష్ణ తీసే మాస్ చిత్రాలకు, చిరంజీవి ప్రతిష్టాత్మకమైన 'ఖైదీనెంబర్ 150'కి కూడా పెద్ద స్థాయిలో బుల్లితెరపై ఆదరణ లభించలేదన్నది వాస్తవం.
ఇక ఎంతో కాలంగా మెగాహీరో వరుణ్‌తేజ్‌కి దిల్‌రాజు నిర్మాణంలో, శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి చేసిన మ్యాజిక్‌గా 'ఫిదా' చిత్రం పెద్ద విజయాన్నే అందించింది. ఈ చిత్రం వరుణ్‌తేజ్‌కి ఏకంగా 50కోట్ల బెర్త్‌లో కూర్చొబెట్టింది. దాంతో ఆయన కూడా ఇక నుంచి అలాంటి చిత్రాలే చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన వెంకీ అనే దర్శకునితో బి.విఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా 'తొలి ప్రేమ' చిత్రం చేస్తున్నాడు. ఇది కూడా మనసుని తాకే సున్నితమైన ప్రేమకథగా రూపొందుతోందని సమాచారం. ఇక తాజాగా 'ఫిదా'కి బుల్లితెరపై అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌కి కాస్త ఎక్కువ మొత్తానికే కొన్న స్టార్‌మా ఛానెల్ నిర్వాహకుల ఆశలను వమ్ముచేయకుండా ఈ చిత్రం మొదటి టెలికాస్ట్‌లో 21.6 టీఆర్పీని సాధించింది. ఇక సెకండ్ టెలికాస్ట్‌లో కూడా ఏకంగా 18.58 టీఆర్పీని సాధించి అందరినీ ఆశ్యర్యపరిచింది.
స్టార్ హీరోల మొదటి టెలికాస్ట్‌కి కూడా 'ఫిదా'కి వచ్చిన సెకండ్ టెలికాస్ట్‌కి వచ్చిన టీఆర్పీలు రావనేది వాస్తవం. ఇలా ఈ చిత్రం అద్భుతంగా ఆదరణ పొందుతుండటంతో స్టార్ మా యాజమాన్యం మంచి ఉత్సాహంగా, సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు వరుణ్‌తేజ్ సినిమాలను వెండితెరపై చూడని ఫ్యామిలీ వీక్షకులు కూడా ఈ చిత్రం బుల్లితెరపై అలరించిన తీరు చూసి, వరుణ్‌కి పట్టం కట్టి, ఆయనకు ఫ్యామిలీ ఫ్యాన్స్ దగ్గరయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. మరి ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్‌ని వరుణ్‌తేజ్ దర్శకుడు శేఖర్‌కమ్ముల, సాయిపల్లవి ఎలా సద్వినియోగం చేసుకుంటారో వేచిచూడాల్సివుంది..!