నేడు వస్తున్న యంగ్ డైరెక్టర్ల ధాటికి ఆల్‌రెడీ దర్శకులుగా ఫేమ్ అయిన వారు తట్టుకొని నిలబడలేకపోతున్నారు. ఒక సినిమాకి కూడా పనిచేయని షార్ట్‌ఫిల్మ్‌మేకర్స్ కూడా తమ వైవిధ్యమైన, వినూత్నమైన కథలు, కథనాలతో ముందడుగు వేస్తున్నారు. ఇక కొందరు వన్ మూవీ వండర్స్‌గా తయారవుతున్నారు. తమ తమ మొదటి చిత్రాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్లకు కూడా రెండు మూడు సినిమాలకే గుజ్జు అయిపోతోంది. కొత్తనీరు రాకడ.. పాత నీరు పోకడ నిజమైనా కొందరు దర్శకులకు మాత్రం క్రేజ్ తగ్గదు. కానీ వారే ఆ అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆ కోవకి చెందిన దర్శకులుగా రుణాకరన్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇక కరుణాకరన్ విషయానికి వస్తే ఆయన నవతరం ప్రేమకథల శైలినే తన 'తొలి ప్రేమ'తో మార్చేశాడు. ఈయనకు ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరుంది. కానీ ఆ తర్వాత వచ్చిన 'యువకుడు, వాసు, బాలు, హ్యాపీ, ఎందుకంటే ప్రేమంట, చిన్నదాన నీకోసం' వంటివి సరిగా ఆడలేదు. ఇక ఆయన తీసిన 'డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా' మాత్రం ఫర్వాలేదనిపించాయి. కానీ అవి తన తొలి చిత్రం 'తొలి ప్రేమ' రేంజ్ మాత్రం కాదనే చెప్పాలి. ఇక ఇప్పటికీ మెగా హీరోల అండదండలతో అవకాశాలు దక్కించుకుంటున్న ఈయన ఇటీవల సీనియర్ నిర్మాత కె.యస్.రామారావు నిర్మాతగా మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా ఓ చిత్రానికి ముహూర్తం పెట్టాడు. ఒకవైపు వినాయక్ సినిమా షూటింగ్, మరోవంక 'జవాన్' రిలీజ్‌ల బిజీలో ఉన్న సాయిధరమ్‌తేజ్ వల్లనే కాకుండా కరుణాకరన్ తన కథకి మరిన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా కాస్త టైం పట్టింది.
ఇక కరుణాకరన్ చిత్రాలలో హీరోకే కాదు.. హీరోయిన్‌కి, ఇతర పాత్రలకు, సోదరి, తాత ఇలా ప్రతి దానికి ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా హీరోలకు ధీటుగా హీరోయిన్ల క్యారెక్టర్లు ఉంటాయి. ఇక ఇది ప్రేమకథా చిత్రమే కానీ 'తొలి ప్రేమ'కి రీమేక్ గానీ, సీక్వెల్ కాదని తేజు తేల్చేశాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఎందరో కొత్తవారిని ట్రై చేశారట. కానీ ఎవ్వరూ సంతృప్తికరంగా కనిపించకపోవడంతో ఇటు నటన, అటు అందం.. రెండు కలగలిసిన మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారని సమాచారం. నిజమే.. పర్‌ఫెక్ట్ హీరోయిన్‌నే సెలక్ట్ చేసుకున్నారు. అనుపమ తన టాలెంట్‌ని ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది. మరి ఈ చిత్రంతోనైనా కరుణాకరన్ గాడిలో పడతాడేమో చూడాలి..!