రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్‌ల తర్వాత తెలుగులో కూడా స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరోగా సూర్యని చెప్పుకోవచ్చు. కానీ ఆయనకు తమిళంలో హిట్‌వచ్చి చాలా కాలమే అయింది. '24' చిత్రం తమిళనాట పెద్దగా ఆడకపోయినా తెలుగులో మాత్రం బాగానే ఆడింది. ఇక తాను కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా దర్శకుడు హరి రూపంలో వచ్చే 'సింగం' సిరీస్‌లు ఆయనకు మరలా స్టార్‌డమ్‌ని నిలుపుతున్నాయి. కానీ ఆమధ్య 'సింగం 2' కూడా 'ఎస్ 3'గా వచ్చి తమిళ, తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది. దీంతో తాజాగా విడుదల కానున్న సూర్య మూవీ ఆయన కెరీర్‌కి ఎంతో కీలకంగా మారింది. అటు తమిళంతో పాటు తెలుగులో కూడా ఆయనకు అర్జంట్‌గా ఒక బ్లాక్‌బస్టర్ కావాలి. దాంతో ఆయన విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో దక్షిణాదిలో ఇప్పుడు క్రేజ్ మీద ఉన్న కీర్తిసురేష్‌ని తనకి జోడీగా పెట్టుకున్నాడు.
ఇక 'నీలాంబరి, శివగామి' పాత్రలతో ఒంటి చెత్తో తాను కూడా ప్రేక్షకులను అలరించగలనని నిరూపించుకున్న రమ్యకృష్ణకి కూడా ఇందులో పవర్‌ఫుల్ రోల్ ఇచ్చారు. మరోవైపు పవన్, త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి'కి సంగీతం అందిస్తూ, తెలుగు వారికి కూడా సంగీత దర్శకుడు అనిరుధ్ పరిచయం కానున్నాడు. ఈయన ఆల్‌రెడీ 'కొలవరి' ద్వారా దేశవిదేశాలలో ఖ్యాతిని పొందాడు. సో.. ఈ చిత్రానికి తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా ప్రేక్షకులను అలరించే అంశాలు చాలానే ఉన్నాయి. 'తానా సెరెంద్ర కూట్టమ్' పేరుతో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో 'గ్యాంగ్' అనే టైటిల్‌ని పెట్టారు. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. గత కొంతకాలంగా సూర్య తన చిత్రాలకు రెమ్యూనరేషన్ బదులు తెలుగు హక్కులను తీసుకుంటున్నాడు. దీని వల్ల ఈయన ఇటీవల చాలా నష్టపోవాల్సి వచ్చింది.
మరోవైపు ఈ చిత్ర తమిళ నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్‌రాజాతో తమకున్న పరిచయం దృష్ట్యా, అల్లుఅరవింద్, యువి క్రియేషన్స్ సంస్థల అధినేతలు ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని 10కోట్లకు తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో పవన్, బాలయ్య, రవితేజ, రాజ్‌తరుణ్ వంటి పలువురు పోటీ పడుతున్నారు. సో.. మంచి థియేటర్లు దొరకాలంటే అల్లు అరవింద్ అండదండలు ఈచిత్రానికి చాలా ముఖ్యమని అర్ధమవుతోంది. మరి ఈ చిత్రంతోనైనా సూర్య తన పూర్వవైభవం సాధిస్తాడేమో వేచిచూడాల్సివుంది..!