'పెళ్లిచూపులు'కు ముందే ఆ చిత్ర నిర్మాత రాజ్ కందూకూరి తన తండ్రి కోరిక మేరకు తాను కొన్ని చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించి డబ్బులు పొగొట్టుకున్నానని ఇటీవల తెలిపాడు. మరలా యూఎస్ వెళ్లి వచ్చిన తర్వాత విజయ్‌దేవరకొండతో తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'పెళ్లిచూపులు' పెద్ద కమర్షియల్ విజయాన్నే కాదు.. అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ చిత్రం విషయంలో ప్రమోషన్స్ నుంచి థియేటర్ల వరకు అన్ని సురేష్‌ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు చూసుకోవడంతో ఈ చిత్రాన్ని ఆయన తన అనుభవంతో నిలబెట్టాడు. సినిమా బాగున్నా మొదట్లో ఎవ్వరూ ఆ చిత్రాన్నిపెద్దగా పట్టించుకోలేదు. కానీ స్లోగా మౌత్‌టాక్ స్ప్రెడ్ కావడంతో ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది.
ఇక రాజ్‌కందుకూరి తాజాగా నిర్మించిన 'మెంటల్ మదిలో' కూడా మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో వెనుకబడింది. దీనికి కారణం ప్రమోషన్స్, థియేటర్స్ విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవడమే. బాగుందని టాక్ వచ్చినా ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని చేరువచేయలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రామ్, కిషోర్ తిరుమల, స్రవంతి రవికిషోర్ వంటి వారే 'ఉన్నది ఒకటే జిందగీ'కి పాజిటివ్ టాక్ వచ్చినా నిలబెట్టలేకపోయారు. ఇప్పుడు అలాగే 'మెంటల్ మదిలో' విషయంలో కూడా జరుగుతోంది. ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో మాత్రం ఇప్పటికే కోటి వసూలు చేసింది. స్లోగా ఇంకా పికప్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా రెండుకోట్ల వరకు వసూలు చేసింది. అయినా ఈ కలెక్షన్లు 'పెళ్లిచూపులు' రేంజ్‌లో లేవని అర్ధమవుతోంది.
ఇక 'అప్పట్లో ఒకడుండే వాడు, ఉన్నది ఒకటే జిందగి' చిత్రాలలో నటించిన శ్రీవిష్ణుకి ఈ చిత్రం మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికైనా ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు దగ్గర చేయడానికి ప్రయత్నిస్తే మంచిదే. మొత్తానికి రాజ్‌కందుకూరి మాత్రం తన అభిరుచిని ఈ చిత్రంతో చాటుకున్నాడు. ఇక ఆయన వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరిలో తన కుమారుడు హీరోగా, రాజశేఖర్ కుమార్తె శివాని జంటగా చిత్రం చేయనున్నాడు. మొత్తానికి పెద్దల అండ ఉంటే 'మెంటల్ మదిలో' రిజల్ట్ భిన్నంగా ఉండేదని అనిపించకమానదు.