తమిళనాట మెర్సల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినిమా విడుదలైన వెంటనే .. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేవిగా ఉన్నాయని.. ఆ డైలాగ్స్ ని తీసేయించేవరకు బిజెపి నాయకులు నిద్రపోలేదు. ఇక వాళ్ళ బాధ పడలేక దర్శకనిర్మాతలు ఆ డైలాగ్స్ ని తీసేశారు. ఇకపోతే మెర్సల్ సినిమా విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రాజకీయనాయకులు, డాక్టర్స్ చేసిన వివాదాల వలన ఎక్కడలేని హైప్ క్రియేట్ అయ్యి.. కోట్లు కొల్లగొట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తో అయితే నిర్మాతలు బాగానే నష్టపోయేవారు. కానీ వివాదాల పుణ్యమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది.
అయితే మెర్సల్ సినిమా విడుదలైన చాలా కాలానికి.. అసలు మెర్సల్ సినిమా కలెక్షన్స్ కూడా క్లోజ్ అయిన టైం కి ఇప్పుడు తాజాగా మెర్సెల్ వలన నిర్మాతకు 60 కోట్లమేర నష్టం వాటిల్లిందంటూ రైటర్ శేఖర్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు శేఖర్ చేసిన ఈవ్యాఖ్యలు తమిళనాట దుమారాన్ని రేపుతున్నాయి. అవసరానికి మించి ఈ సినిమాకి బడ్జెట్ పెట్టించాడని... దర్శకుడు అట్లీ పై శేఖర్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడమేకాదు... తమిళ సినిమాల్లో ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయిందని.. అందులో భాగంగానే మెర్సల్ బడ్జెట్ కి కట్టడి లేకుండా పోయిందని అన్నాడు.
అంతేకాకూండా దర్శకుడు అట్లీ మెర్సల్ సినిమాకి ముందు సినిమాకి 3 కోట్లు తీసుకుంటే.. ఇప్పుడు మెర్సల్ సినిమాకి 13 కోట్ల పారితోషికం అందుకున్నాడని.... మెర్సల్ నష్టాన్ని ఎవరు పూడుస్తారంటూ ఓ ఇంటర్వ్యూలో రెచ్చిపోయి మాట్లాడాడు శేఖర్. మరి మెర్సల్ సినిమా కలెక్షన్స్ సూపర్ అంటుంటే.. ఇలా ఇప్పుడు శేఖర్ మెర్సల్ కి నష్టాలొచ్చాయనడం ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే కొంతమంది ఈ సినిమాకి నిర్మాతతో పాటు ఈ చిత్రంపై పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ లాభాలు అందుకున్నారని.. శేఖర్ కేవలం దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.