నాడు సావిత్రికి ఒక కెమెరామెన్, దర్శకుడితో షూటింగ్ మధ్యలో కాస్త విబేధాలు వచ్చాయి. దాంతో ఆ కెమెరామెన్, దర్శకుడు కలిసి సావిత్రిని ఎలాగైన యూనిట్ అందరి ముందు అవమానించాలని భావించారు. ఓ క్లోజప్ షాట్‌ని పెట్టి ఏడవమని చెప్పారు. దానికి సావిత్రి అలాగేనని చెప్పింది. కానీ వారిద్దరు కేవలం పది కన్నీటి చుక్కలు నీ కంటి నుంచి రావాలి.. అని కండీషన్ పెట్టారు. దాంతో నిర్మాత జోక్యం చేసుకుని ఏడవమంటే ఏడవగలదు.. ఆమెకి గ్లిజరిన్ కూడా అవసరం లేదు. కానీ పదే పది కన్నీటి చుక్కలే రాల్చాలని కండీషన్ పెడితే ఎలా అని ప్రశ్నించాడు.
దానికి సమాధానంగా యూనిట్ అందరూ వినేలా ఆ కెమెరామెన్, దర్శకుడు 'మహానటి' అని పిలిపించుకుంటోంది కదా..! ఇదేం ఆమెకి పెద్ద లెక్క కాదని వ్యంగ్యంగా అన్నారు. దానికి సావిత్రి అలాగే 10కన్నీటి చుక్కలైనా, వంద కన్నీటి చుక్కలైనా మీరు ఎన్ని చెబితే నేను ఒకే 10 సెకన్ల షాట్‌లో రాల్చగలను అని చెప్పి చేసి చూపించింది. అలాంటి మహానటి సావిత్రి బయోపిక్‌లో ఆమె పాత్రను కీర్తిసురేష్ చేస్తోంది. ఈ చిత్రం గురించి కీర్తి మాట్లాడుతూ. 10 సెకన్లలో 100 హావభావాలు ప్రదర్శించగలిగిన ప్రతిభావంతురాలు సావిత్రిగారు. ఆమెలా నటించడం అంటే ఎంతో కష్టం. అందునా సావిత్రి వయసు మారే కొద్ది ఆమెకు కూడా రూపంలోనే కాదు... అన్ని విషయాలలోనూ మార్పులు వచ్చాయి.
నేను కూడా అలా మారిపోతూ కనిపించాలంటే అంత సులభం కాదు. ఇక ఈ చిత్రంలో 'సావిత్రి' పాత్ర చేస్తోన్న నాకు 100 రకాల కాస్ట్యూమ్స్‌ని వాడుతున్నారు. ఈ చిత్రంలోని హైలైట్స్‌లో ఇది కూడా ఒకటి కానుంది అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే షూటింగ్‌ని వేగంగా జరుపుతున్నారు. ఇందులో మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్, విజయ్‌దేవరకొండ, దుల్కర్ సల్మాన్, సమంత, షాలినిపాండే, క్రిష్, సాయిమాధవ్ బుర్రా వంటి వారు నటిస్తున్న సంగతి తెలిసిందే.