అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పుట్టడానికి రావడానికి కారణం మా ఉద్యోగాలు మాకే.. మా సంపద మాకే.. మా సంస్కృతి, సంప్రదాయాల రక్షణ కోసమేనని గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు చెప్పారు. ఆంధ్రా వారు తమ తెలంగాణ యాసకి, పెద్దమ్మ, బతుకమ్మ, సమ్మక్క-సారక్క వంటి వాటికి అవమానం చేస్తున్నారనేది ఈ ఉద్యమానికి ప్రధానకారణం. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకే చెందిన పలు దినపత్రికలు, ఛానెల్స్ వెలుగులోకి వచ్చాయి.. వస్తున్నాయి. ఇక వి6 ఛానెల్ కూడా అందులో ఒకటి. ఇలాంటి వాటిల్లో కత్తి కార్తీక నుంచి బిత్తిరి సత్తి వరకు తెలంగాణ యాసకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఈ ఛానెల్‌లో వచ్చే 'తీన్మార్' షో ద్వారానే బిత్తిరి సత్తి ఫేమస్ అయ్యాడు. ఆయన ఆయా యాసలో మాట్లాడేతీరు, ఆయన చేసే పనులు ఎంతో ప్రాచుర్యం పొంది.. ఏకంగా ఆయన హీరోగా ఓ చిత్రం తీసేంతగా పాపులర్ అయ్యాడు. ఆయన ఈ షో ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ, హాస్యాన్ని అందిస్తుంటాడు. అలాంటి బిత్తిరి సత్తిపై తెలంగాణకే చెందిన సికింద్రాబాద్ యువకుడు తమ భాషని వ్యంగ్యంగా చూపిస్తున్నాడని ఆయనపై హెల్మెట్‌తో దాడి చేశాడు. అంతేకాదు. ఇకపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించాడు.
గాయపడిన బిత్తిరిసత్తిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. బహుశా దాడి చేసిన దుండగుడు కేవలం వార్తల్లో నిలిచేందుకే ఈ పని చేశాడని అంటున్నారు. అందరూ ఇలా పక్క దారుల్లో సెలబ్రిటీలు అయితేనే ఇక సామాన్యులు ఎవరుంటారు..? బాబూ...! దీనిపై కేసీఆర్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో వేచిచూడాలి...!