నాడెప్పుడో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా శ్రీదేవి, జయసుధ నటించగా దాసరి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'ప్రేమాభిషేకం'. అందులో శ్రీదేవి ప్రేమ కోసం అర్రులు చాస్తూ, ఆమె ఓ దేవి ఆలయానికి వెళితే, అక్కడ ఎంటర్ అయ్యే ఏయన్నార్.. ఆ గుడిలోని దేవతను 'శ్రీదేవి'కి అన్వయిస్తూ 'దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా' అంటూ ఆమె తన భక్తుడి మొర విని, భక్తుడిపై కరుణ చూపాలని పాట పాడుతాడు. ఇక వర్మ అయితే తన 'గోవిందా.. గోవిందా' చిత్రంలో 'అమ్మ బ్రహ్మదేవుడో.. కొంపముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో.. ఏడ దాచినావురో.. కొన్ని పూల రెక్కలు, కొన్ని తేనే చుక్కలు.. రంగరిస్తివో.. ఇలా బొమ్మచేస్తివో' అని శ్రీదేవి అందాల మీద ఏకంగా ఓ పాటను రాయించి పెట్టాడు.
ఇక వర్మకి దెయ్యాలు, అలాంటి సినిమాలంటే బాగా ఇష్టం. కానీ ఆయనకు పెద్దగా దేవుడంటే నమ్మకం లేదు. ఏదో 'గోవిందా..గోవిందా'లో కాస్త చూపించాడు. ఇక ఈయన తాను శ్రీదేవికి వీరాభిమానినని, తనకు అవకాశం వస్తే బోనీకపూర్‌ని చంపేస్తానని చెప్పాడు. ఇక 'క్షణక్షణం' చిత్రంలో శ్రీదేవి అందాలను ప్రత్యక్షంగా చూడటం కోసమే ఆమె చేత పొట్టి డ్రస్‌లు వేయించానని, ఆ చిత్రం షూటింగ్ అడవుల్లో జరుగుతున్నప్పుడు ఆమె తొడపై పురుగు కుడితే ఆమె అందాల వైపు తాను చూస్తూ తన్మయత్వంలో మునిగితేలానని చెప్పాడు.
ఇప్పుడు ఆయన ఓడ్కా గ్లాస్ పక్కన పెట్టుకుని తన హోమ్ థియేటర్‌లో శ్రీదేవి, సన్నిడియోల్ నటించిన 'చాల్‌బాజ్' చిత్రంలోని 'నా జానే కహాసే...ఆయీ ఏ లడకీ' అనే పాటలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన శ్రీదేవిని చూసి మైమరిచిపోయి ఆ పాటలో తన్మయత్వంలో తేలియాడుతూ కనిపించాడు. అది కూడా దేవుని ముందు భక్తుడిలా నేలపై కూర్కొని, శ్రీదేవి ధ్యానంలో మునిగిపోయిన వర్మ వీడియోని నటి చార్మి ట్విట్టర్లో పెట్టింది. 'భక్తుడు రాంగోపాల్‌వర్మ...శ్రీదేవి కోసం ఇక్కడ నేలపై కూర్చుని ఉన్నారు. రాముయిజం, ఫ్యానిజం' అనే వ్యాఖ్యలను జతచేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది.