సినిమాలలో ఒక 10, 15 నిమిషాలు నిడివి ఉండే కామెడీ రోల్స్, హీరోలకి ఫ్రెండ్‌గా కథలో కలిసిపోయే క్యారెక్టర్స్ చేయడం వేరు. అంతేగానీ రెండున్నరగంటల చిత్రాన్ని కేవలం తన భుజస్కంధాలపైనే నడపడం సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో మీడియం రేంజ్ హీరోలు కూడా బోల్తాపడుతున్నారు. స్టార్ హీరోలు అలా సినిమా అంతటినీ తమ భుజాలపై మోసినా కంటెంట్ లేకపోతే నిర్దయగా నిరాదరిస్తున్నారు. ఇక కమెడియన్లు హీరోలుగా కావడం ఇప్పటిది కాదు. తెలుగులో రేలంగి, రాజబాబు, పద్మనాభం వంటి వారు అలాంటి చిత్రాలను తామే నిర్మించి ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇక ఈతరంలో కూడా అలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్, సునీల్ వంటి వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఫుల్‌లెంగ్త్ కామెడీ ఉండి. తమకు తగ్గ పాత్రయితే ఓకే. అలా చేసిన 'యమలీల, అందాల రాముడు, మర్యాదరామన్న' వంటి చిత్రాలు బాగానే ఆడాయి. కానీ అనవసరపు బిల్డప్‌లిస్తే సునీల్‌లాగా మారాల్సిందే.
ఆయన ప్రేక్షకులు ఎంతగా రిజెక్ట్ చేసినప్పటికీ తనకున్న డ్యాన్సింగ్ స్కిల్స్, సిక్స్‌ప్యాక్ పెంచి సీరియస్ పాత్రలను, ఏకంగా యాక్షన్ మాస్ చిత్రాలను కూడా చేశాడు. దెబ్బమీద దెబ్బతగులుతున్నా.. చిరంజీవి 'ఖైదీనెంబర్ 150' పవన్-త్రివిక్రమ్‌ల 'అజ్ఞాతవాసి'లలో వచ్చిన అవకాశాలను కూడా కాదనుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా మరలా కమెడియన్‌గా అవతారం ఎత్తడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులోనే కాదు.. తమిళంలో నగేష్, సంతానం, వడివేలు వంటి వారు కూడా ఇలాగే తప్పటడుగులు వేశారు.
ఇక సప్తగిరి విషయానికి వస్తే ఆయనది హీరో మెటీరియల్ కాదనేది ఆయనకు బహుశా తెలుసో లేదో..? పవన్‌కి 'కాటమరాయుడు' టైటిల్‌ని ఇచ్చి పవన్ ఆశీర్వాదంతో, పవన్ అభిమానుల పుణ్యాన తన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమాని సో..సో అనిపించాడు. ఇప్పుడు ఏకంగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'గా వస్తున్నాడు. పాటని వినాయక్ చేత రిలీజ్ చేయించి, ట్రైలర్‌ని రామ్‌చరణ్ చేతుల్లో పెట్టాడు. ఇక ఈ చిత్రం ఎల్‌ఎల్‌బి అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతున్నప్పటికీ కోర్టులో వచ్చే కామెడీ సీన్స్ సిల్లీగా ఉన్నాయి.
ఇక డ్యాన్స్, ఫైట్స్‌లో ఆయనకు ప్రావీణ్యం ఉండవచ్చు గానీ ఓ కమెడియన్ అలా ఓవర్ చేస్తే అటు ఇటు అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఈ ట్రైలర్ చూస్తే ఈ చిత్రంలో సప్తగిరిని మించిన మోతాదు ఉన్నట్లు అర్ధమవుతోంది. మరో విషయం ఏమిటంటే. సప్తగిరి తన చిత్రాల టైటిల్స్‌ని కూడా తన పేరుతోనే 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బి' అని పెట్టడం చూస్తుంటే ఆయన నిజజీవితంలో నేలపై ఉన్నాడా? లేక ఆకాశంలో భ్రమలో తేలియాడుతున్నాడా? అనే అనుమానం రాకమానదు...!