సాయిధరమ్‌తేజ్ సినిమాలలోనే కాదు... ఆయన బయట, షూటింగ్‌లలో కూడా ఎంతో జాలీగా, నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడని అందరు చెబుతారు. ఇక ఆయన స్పాంటేనియస్‌గా కూడా బాగా మాట్లాడి ఎవరినైనా తన మాటలతోనే పడేస్తాడనే పేరుంది. ఈయన హీరోగా నటించిన 'జవాన్' చిత్రం డిసెంబర్ 1న విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్‌ని యూనిట్ ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా ఓ ఛానెల్‌తో ఇంటర్వ్యూలో సాయిధరమ్‌తేజ్ తనకెదురైన ప్రశ్నలకు జోక్‌లతో సమాధానం ఇచ్చి వీక్షకులను అలరించాడు.
మీరు ఎవరితోనైనా డేటింగ్ చేశారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ... నన్ను ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా డేట్‌కి పిలవలేదు. నేనే ఓ నటిని డేటింగ్‌కి ఆహ్వానించాను. దానికి ఆమె నా బోయ్‌ఫ్రెండ్‌ని అడిగి చెబుతానని సమాధానం ఇచ్చింది అని చెప్పాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో సులభంగా ఊహించవచ్చు. సాయిధరమ్‌తేజ్ నటించిన 'తిక్క' చిత్రంలో నటించిన విదేశీ భామ లారిస్సా బోనేసి. గతంలో వీరిమద్య ఎఫైర్ ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఇద్దరు కొట్టిపారేశారు. ఇక ఇటీవల లారిస్సా చేసిన న్యూడ్ ఫొటోషూట్స్‌ని తేజ్ తన సోషల్‌మీడియాలో పెట్టి ఆమెకి విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే.
మరోపక్క 'జవాన్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మెహ్రీన్ గురించి తేజూ మాట్లాడుతూ....మెహ్రీన్‌కి అంకిత భావం ఎక్కువ. ఎంతో కష్టపడుతుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర హీరో పాత్రని డామినేట్ చేస్తుంది. నిజానికి ఈ తరహా పాత్రలు చేయడం సులభం కాదు. పైగా ఇప్పటివరకు ఆమె గ్లామర్ పాత్రలనే చేస్తూ రావడం వల్ల ఈ చిత్రం షూటింగ్ మొదట్లో కాస్త కంగారుపడింది. ఈ పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని తర్వాత సులభంగా చేయగలిగింది.. అని చెప్పాడు.