తెలుగుస్టార్స్‌కి అసలు ఒకరంటే ఒకరికి పడదని, ఇక్కడి ఫ్యాన్స్ నిత్యం కొట్టుకుంటూ ఉంటారని, అందువల్లే అక్కడ నిజమైన మల్టీస్టారర్స్ రావడం లేదని సల్మాన్‌ఖాన్ నుంచి తాప్సి వరకు అందరూ నవ్వినవారే. కానీ నవ్విన నాప చేనే పండింది అన్నట్లుగా తెలుగు సినిమా స్టామినా ఏమిటో జక్కన్న తన 'బాహుబలి'తో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలకు, ప్రేక్షకులకు రుచిచూపించాడు. ఇక చిరంజీవి 'సైరా..నరసింహారెడ్డి'తో పాటు శంకర్, రజనీ, అక్షయ్‌కుమార్‌ల '2.0', ప్రభాస్ 'సాహో' లపై ప్రస్తుతం అందరి దృష్టి నిలిచి ఉంది. ఇంతలో మరోసారి జక్కన్న తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడు? అనే దానిపై జాతీయ మీడియాలో కూడా అటెన్షన్ కనిపిస్తోంది. దీంతో మరోసారి బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలు జక్కన్న చిత్రంవైపు, టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూపుసారించాయి. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌గా డి.వి.వి.దానయ్య నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్ అని తాము ముగ్గురం తీయించుకున్న ఫొటోద్వారా క్లూ ఇచ్చాడు. అయినా ఇది సాధ్యమయ్యే పనేనా? అని అందరు కాస్త ఆలోచనలో పడ్డారు. ఎట్టకేలకు సాయిధరమ్‌తేజ్ తన 'జవాన్' ప్రమోషన్స్‌లో ఇది నిజమేనని తేల్చేశాడు.
ఇక ఈ చిత్రం గ్రాఫిక్స్‌కి, విఎఫ్‌ఎక్స్‌కి అవకాశం లేని ఓ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలోనే ఇలాంటివి లేని చిత్రాన్నే తన తదుపరి చిత్రంగా చేస్తానని, తన తదుపరి ప్రాజెక్ట్ దానయ్యకేనని రాజమౌళి చెప్పిన మాట తెలిసిందే. ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్-చరణ్‌లు అన్నదమ్ములుగా నటిస్తారని, ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ అని వార్తలు వస్తున్నాయి. ఇందులో హీరోలిద్దరు బాక్సర్స్‌గా కనిపిస్తారట. దీని కోసం వారు మేకోవర్ సాధించి, కండలు పెంచి, ఫిజిక్ విషయంలో అచ్చు బాక్సర్స్‌లానే కనిపించాలని రాజమౌళి వారికి చెప్పినట్లు సమాచారం. మరి ఇది నిజమేనా? రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌లు వీరి కోసం ఎలాంటి కథను వండి వారుస్తారో చూడాలి...!
ఇక గతంలో రాజమౌళి నితిన్‌తో రగ్బీ క్రీడ నేపధ్యంలో 'సై' చిత్రం చేశాడు. భారీ బడ్జెట్, నితిన్‌కి పెద్దగా మార్కెట్ లేకపోవడంతో సినిమా అలరించినా పెద్దగా లాభాలు తీసుకుని రాలేదు. దీంతో ఇప్పుడు ఈ చిత్రంపై అందరి దృష్టి ఉంది. మొత్తానికి చరణ్, ఎన్టీఆర్‌లతో జక్కన్న 'కరణ్ అర్జున్' వంటి చిత్రం చేయడం మాత్రం పక్కా అని తేలిపోయింది...!