మన దేశంలో రాజకీయనాయకులు, ఇతర సెలబ్రిటీ అతిథులు వస్తే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వారు పర్యటించే ప్రదేశాలలో హైసెక్యూరిటీ ఏర్పాటుచేస్తారు. ముందుగా బాంబ్ స్క్వాడ్‌ల నుంచి వారు ప్రయాణించే దారి పొడవునా హైఅలర్ట్ సెక్యూరిటీని, రోడ్లు క్లీనింగ్, పెయింట్స్ వేస్తారు. ఎంతో ముందుగానే ఆ స్థలాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుంటారు. వారు ప్రయాణించే కార్లు, హెలికాప్టర్లు, విమానాల నుంచి ప్రతిదీ ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కానీ అదే సామాన్యులు వెళ్లే రైళ్లలో, రోడ్లపై కనీసపు సెక్యూరిటీ కూడా ఉండదు.
ఇక ప్రముఖుల రాక సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లతో పాటు పోలీసుల ఓవర్‌యాక్షన్ కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అదేమంటే సెక్యూరిటీ రీజన్స్‌ని కారణంగా చెబుతారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ జీఈఎస్ సదస్సు కోసం హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దీనిపై తెలుగు నటి, 'నచ్చావులే' చిత్రంతో అందరినీ అలరించిన మాధవీలత మండిపడింది. నిజంగా ఆమె వెలిబుచ్చిన అభిప్రాయలు నిక్కచ్చిగా ఉన్నాయి. ఇవాంకా ట్రంప్ వంటి అతిధులు వస్తే ఇలా క్లీనింగ్‌లు, పెయింట్స్, వీధులన్ని శుభ్రంగా ఉంచుతూ నానా హడావుడి చేస్తున్నారు.
మరి మన నాయకులు అమెరికా వెళ్లితే వారు ఇంత హడావుడి చేస్తారా? చేయరు.. అంటే వారికి అతిధిమర్యాదలు తెలియవని భావించాలా? లేక మర్యాదలు చేయడం వారికి రాదా? లేక మన వారిని పట్టించుకోరా? లేక సామాన్యుల కోసం వేసిన మౌళిక సదుపాయాలే అతిధులకు కూడా చాలనుకుంటారా? అని ప్రశ్నించింది. నిజానికి విదేశాలలో ఎలాగూ ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనలో ముందుంటారు. సామాన్యులకు కూడా హై సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చే అతిధుల కోసం ప్రత్యేకంగా ఏమీ చేయరు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచినవే అతిధులకు కూడా అందిస్తారు.
ఇక మాధవీలత మాట్లాడుతూ, అతిధులకు చేసే మర్యాదలను, మౌళిక సదుపాయాలను ప్రభుత్వాలు సామాన్యులకు కూడా అందించాలి. వారి ప్రాణాలకు ఉన్న రక్షణ మన ప్రజలకు లేదా? అని ప్రశ్నించింది. అయినా సరే మనకు సిగ్గులేదు. మరలా అలాంటి నాయకులకే ఓట్లు వేస్తాం. అదేమంటే కనీసం అతిధులు వచ్చినప్పుడైనా వారు రోడ్దు వేశారులే.. అని అల్పంగా సంతోషపడతాం. ఇది మారాలి.. అని తన అభిప్రాయాన్ని సూటిగా తెలిపింది ఈ ముద్దుగుమ్మ...!